Chandrababu Arrest: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. టీడీపీ నేతలు, నాయకులు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర బందుకు పిలపునిచ్చారు.
టీడీపీ నేతలే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. విషయం తెలిసిన వెంటనే విజయవాడకు తరలివెళ్లారు. ఇలా ఎందరో స్పందించి..చంద్రబాబు నాయుడికి తమ మద్దతు తెలుపుతుంటే.. నందమూరి కుటుంబ వారసుడు, చంద్రబాబు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఊసు కూడా వినిపించలేదు. చంద్రబాబు అరెస్టుపై ఒక్కమాట కూడా ఆయన మాట్లాడలేదు. అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లోనూ ఎలాంటి పోస్టూ కనిపించలేదు.
నారా భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేసారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ సందర్బంలో వెంటనే స్పందించారు ఎన్టీఆర్. అంతేకాదు ఓ వీడియోను సైతం విడుదల చేశారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, ఓ మహిళపై విమర్శలు చేయడం అరాచక పాలనకు దారి తీసినట్టే అంటూ మండిపడ్డారు. కానీ ఎందుకో చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నా ఇప్పటికీ ఎన్టీఆర్ స్పందించడం లేదు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీరామారావు బొమ్మతో కేంద్ర ప్రుభుత్వం రూపాయి నాణాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ హాజరుకాలేదు.
పెద్దల నుంచి ఆహ్వానం అందినా కూడా వెళ్లలేదట జూ. ఎన్టీఆర్. నారా కుటుంబంతో కలవడం ఇష్టం లేకనే ఇలా దూరం పాటిస్తున్నారు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ పై కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టుగా మారింది. దీంతో ఆయన అభిమానులు ఎన్టీఆర్ కు రాజకీయాలు అంటే ఇష్టం లేదా? నారా వారి కుటుంబం అంటే ఇష్టం లేదా? అని గుసుగుసలు పెట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా స్పందించి ఆ ముద్రను చెరిపివేసుకుంటారో లేదో చూడాలి.