
Chandrababu Vs Kodali Nani: ఏపీలో గుడివాడ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపికే. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, ఇప్పుడు జగన్.. పాలకులు ఎవరైనా ఏదో రూపంలో గుడివాడ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతునే ఉంది. ఇప్పుడు మాత్రం కొడాలి నాని రూపంలో అందరి నోట వినిపిస్తోంది. గుడివాడనే కేరాఫ్ అడ్రస్ గా మార్చుకొని తనను పడగొట్టేది ఎవరంటూ చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ చేస్తూ వస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఐదోసారి గెలిచి తీరుతానని శపథం చేస్తున్నారు. నాని హవాను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డాల్సి వస్తోంది. సరైన అభ్యర్థిని నిలబెట్టలేక సతమతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గుడివాడలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కృష్ణా జిల్లాలో మూడురోజుల పర్యటన..
లోకేష్ యువగళం పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుండగా.. చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే బందరు పర్యటన పూర్తయ్యింది. ఇవాళ నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనున్న చంద్రబాబు అక్కడ నుంచి గుడివాడ చేరుకోనున్నారు. అక్కడ రోడ్ షో నిర్వహించి అనంతరం జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీలో వర్గాలు, ధీటైన అభ్యర్థిని నానిని ఎదుర్కొనే క్రమంలో చంద్రబాబు వ్యూహం ఏమిటా అన్నది అంతుపట్టడం లేదు. ఇటువంటి తరుణంలో గుడివాడ పర్యటన కత్తిమీద సాములా మారింది.
క్యాండిడేట్ డిసైడ్?
అయితే చంద్రబాబు టీడీపీలో ఉన్న వర్గ విభేదాలపై దృష్టిపెడతారని తెలుస్తోంది. గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి గెలుపుపై దృష్టిసారించిన కొడాలి నాని హవాను అడ్డుకోవాలంటే ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గుడివాడ రాజకీయాల్లో అంగబలం, అర్ధబలంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై వెనిగండ్ల రాముకు తోడు ఎన్నో ఏళ్లుగా అక్కడే పాగా వేసిన రావి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి వీరిలో ఒకరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఇవాళ గుడివాడ టీడీపీ అభ్యర్ధిపై ప్రకటన రావొచ్చంటున్నారు.

చాలా ఏళ్ల తరువాత..
చాలా ఏళ్ల తరువాత చంద్రబాబు గుడివాడ గెడ్డపై అడుగుపెడుతున్నారు. చివరిసారిగా తన ప్రభుత్వ హయాంలో ఒకసారి పర్యటించారు. గత ఎన్నికల్లో నానిపై దేవినేని అవినాష్ ను నిలబెట్టినా చంద్రబాబు ప్రచారానికి రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాలుగేళ్లు గుడివాడ వైపు చూడలేదు. మొన్నటికి మొన్న మినీ మహానాడుకు వస్తానని భావించినా.. పార్టీలో విభేదాలతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు వస్తుండడంతో సొంత సామాజికవర్గ నేత కొడాలి నానిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.