
Hot Summer: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే తీక్షణమైన ఎండ ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రఛండంగా మారిపోతోంది. సాయంత్రానికి ఉడికించేస్తోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు, వివిధ రుగ్మతలతో బాధపడే వారు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఆ మండలాల్లో అధికం..
దేశంలోని పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అందులో ఏపీలోని పలు ప్రాంతాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఏపీలోని 126 మండలాల్లో, శుక్రవారం 108 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం సమయాల్లో అవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అటు వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రస్తుతం ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యాశాఖ సైతం అప్రమత్తమైంది.

ఉక్కపోత..ఆపై వడగాలులు
ఎండకు తోడు వడగాలులు వీస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రెండురోజుల్లో వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారంనాడు అల్లూరి జిల్లాలో 8, అనకాపల్లి 17, తూర్పుగోదావరి 13, ఏలూరు 4, గుంటూరు 6, కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 6, నంద్యాల 1, ఎన్టీఆర్ 17, పల్నాడు 2, మన్యం 12, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 2, విజయనగరం 17, వైయస్సార్ జిల్లాలోని నాలుగు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.