లాక్‌డౌన్ సక్రమంగా అమలు కాకపోవడంతో పాటు కరోనా వైరస్ సహితం అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ తో పాటు నాలుగు ప్రధాన నగరాలకు కేంద్ర బృందాలను పంపుతున్నట్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గత రాత్రి ప్రకటించింది. మిగిలిన నగరాలు చెన్నై, అహ్మదాబాద్, సూరత్.
మొత్తం తెలంగాణలోని పాజిటివ్ కేసులలో దాదాపు సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా, వాటిల్లో సగానికి పైగా పాత బస్తీలోనే ఉన్నాయి.
ప్రతి రోజు రెండంకెలలో కేసులు తాజాగా ఇక్కడ నమోదవుతున్నాయి. రెడ్ జోన్ లుగా ప్రకటించి, పలు చోట్ల స్థానికులే తమ వీధులకు బారికేడ్లు ఏర్పాటు చేస్తుకున్నా లాక్ డౌన్ సక్రమంగా అమలు కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో వైరస్ కట్టడి అవుతున్నా పాత బస్తీలో కాకపోవడం, ప్రతి రోజూ కేసులు పెరుగుతూ ఉండడం అధికారులకు సహితం ఆందోళన కలిగిస్తున్నది. దానితో కేంద్రం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నది.
కేంద్రం బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నది. ముఖ్యంగా.. లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా?, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది.
నగరంలో కేవలం 45 కుటుంబాలు 260 మందికి ఈ వైరస్ ను సోకేటట్లు చేశాయని స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం పరిస్థితి తీవ్రతను వెల్లడి చేస్తుంది. తెలంగాణలో మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకోగా, వాటిల్లో దాదాపు సగం కేసులు కేవలం 113 కుటుంబాల నుంచే నమోదు కావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 485 కేసులు నమోదు కాగా, ఆ 45 కుటుంబాల నుంచి వచ్చిన పాజిటివ్‌ల సంఖ్య 268గా ఉంది. అంటే మొత్తం హైదరాబాద్ నగరంలోని కేసులలో నాలుగోవంతు ఉందన్నమాట. ఇంకా మర్కజ్ జమాత్ సమావేశాల నుండి తిరిగి వచ్చిన వారందరి ఆచూకీ ఇంకా పూర్తిగా లభించలేదని గత వారం ఆరోగ్య మంత్రి రాజేందర్ పేర్కొనడం గమనార్హం.
పాతబస్తీలో స్థానికుల సహాయ నిరాకరణతో పాటు రాజకీయ వత్తిడుల కారణంగా అధికారులు సహితం కఠినంగా వ్యవహరింపలేక పోతున్నట్లు తేలుతున్నది. పాత బస్తీలో నాలుగైదు కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి అధికారులు చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తున్నది.
బారికేడ్లు ఏర్పాటు చేసినా వైరస్ వ్యాప్తి నిరోధానికి కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు తగు దృష్టి సారింపలేక పోతున్నారు.
కొన్ని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు యధేచ్చగా సాగుతున్నా పోలీసులు రాజకీయ కారణాలతో పట్టించుకోలేక పోతున్నారు. ప్రాంతాల వారీగా వివిధ విభాగాలతో నోడల్ అధికారులు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు.