Women Reservation Bill: మహిళా బిల్లు పై కేంద్రం కీలక ప్రకటన.. ఊపిరి పీల్చుకున్న బిఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2014 నుంచి భారత రాష్ట్ర సమితి కేంద్రాన్ని కోరుతూ వస్తోంది.

Written By: Bhaskar, Updated On : September 20, 2023 1:52 pm

Women Reservation Bill 2023

Follow us on

Women Reservation Bill: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కానీ వారంతా లో లోపల మదన పడుతున్నారు. ఒకవేళ బిల్లు అమల్లోకి వస్తే తమ నెత్తిన పిడుగు పడినట్టేనని భయపడ్డారు. కానీ, నియోజకవర్గాల పునర్విభజన, జన గణన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ నేతలు మొత్తం బతికిపోయారు. “మహిళా బిల్లు వాయిదా పడటమే మంచిదయింది.. లేకుంటే మన పరిస్థితి ఏమయ్యేదో” అని అంతర్గతంగా వాపోతున్నారు. అంతేకాదు ప్రస్తుత ఎన్నికలపై ఈ బిల్లు ప్రభావం ఉండదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2014 నుంచి భారత రాష్ట్ర సమితి కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. డి లిమిటేషన్ తర్వాత తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 156 నుంచి 160 వరకు చేరుతుందని అంచనా. ఉన్న నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాల్సి వస్తే శాసనసభకు 39 మందికి, శాసన మండలికి 13 మందికి, లోక్ సభ స్థానాల్లో ఐదుగురికి పోటీ చేసే అవకాశం కల్పించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే 80 స్థానాల్లోనే పురుషులకు అవకాశం ఉంటుంది. అధికార భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించింది. ఇందులో కేవలం ఆరుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే ఇంకా 33 మందిని కొత్తవారిని చూసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రం చెప్పడంతో భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఊపిరి పీల్చుచుకుంది. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో మొత్తం సీట్లు 160 అయితే.. 52 స్థానాలను మహిళలకు కేటాయించాల్సి వస్తుంది.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,05, 42,33 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,53,73066 పురుషులు, 1,52,51,719 మహిళలు ఉన్నారు. 49.77 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 63 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఈ 63 స్థానాల్లో కీలక నేతల స్థానాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్నింటిలోనూ మగ వారి కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ మెజార్టీ స్థానాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తే కీలక నేతల స్థానాలు గల్లంతవుతాయి. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి కీలక నేత ఈటల రాజేందర్ తమ స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది. వేరే నియోజకవర్గం ఏర్పడుతుంది. డి లిమిటేషన్ సమయంలో మండలాలు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారే అవకాశం ఉంది. అలా పునర్విభజన జరిగే క్రమంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే మండలాలు ఇతర నియోజకవర్గాలకు వెళ్తే వీరంతా సేఫ్ గా ఉంటారు. అలాగే డీలిమిటేషన్ తర్వాత లెక్కలు మొత్తం పూర్తిగా మారిపోతాయి. మహిళా రిజర్వేషన్లతో కొందరు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.