https://oktelugu.com/

PM Modi On Women Reservation Bill: మహిళా బిల్లుపై మోడీ మాస్టర్ స్కెచ్

నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్.. వంట గ్యాస్ సిలిండర్ పై రాయితీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణం. మద్యపానం పై నిషేధం.. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు ఏమి చేసినా మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే.

Written By: , Updated On : September 20, 2023 / 01:55 PM IST
PM Modi On Women Reservation Bill

PM Modi On Women Reservation Bill

Follow us on

PM Modi On Women Reservation Bill: మహిళా బిల్లు ఎప్పుడో 1996లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. 2008లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గీతా ముఖర్జీ నేతృత్వంలోని జె పిసి సిఫారసులతో మళ్లీ రూపకల్పన దిశగా అడుగులు వేసింది. ఆ తర్వాత మళ్లీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లోకి ప్రవేశించింది. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా బిల్లును తెరపైకి తేవడం ఎందుకు? దీనికి అన్ని పార్టీలు ఎందుకు ఆమోదం తెలుపుతున్నాయి?

నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్.. వంట గ్యాస్ సిలిండర్ పై రాయితీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణం. మద్యపానం పై నిషేధం.. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు ఏమి చేసినా మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే.. గతంలో ఒక మతాన్ని లేదా ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు పథకాలు ప్రకటించేవి. ఇప్పుడు అవి మహిళా కేంద్రంగా మారాయి. టీలకుల అంచనా ప్రకారం ఓటు హక్కు వినియోగంలో పురుషుల కంటే మహిళలే చైతన్యవంతంగా ఉన్నారు. అందుకే అతివల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు అని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 33 శాతం రిజర్వేషన్ ను మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాల వైపు మహిళలు నిలిచారు. వీరిలో 50 శాతం మంది గృహిణిలే కావడం విశేషం. కాంగ్రెస్-యూపీఏ, ఇతర పార్టీలకు 27% మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే 2019లో ట్రిపుల్ తలాక్ రద్దును ప్రస్తావిస్తూ ముస్లిం మహిళల ఓట్లను ఏ విధంగానైతే పొందారో, 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ అంశాన్ని పేర్కొంటూ మొత్తం మహిళా వర్గం ఓట్లు రాబట్టాలి అనేది మోడీ వ్యూహంగా రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి.

మోడీ ప్రభుత్వం ఇప్పటికే మహిళలను కేంద్రంగా చేసుకొని భేటీ బచావో భేటీ పడావో, ఉజ్వల్ యోజన, ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టి, వాటి అమలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బిజెపి వీటిని ప్రచారంలో చాలా హైలెట్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్, బీహార్ లో జేడీయు, తమిళనాడులో డీఎంకే, ఢిల్లీ లో ఆప్ గెలుపునకు అతివల ఓట్ల అవసరాన్ని గుర్తించి పథకాలు ప్రకటించడం గమనార్హం. కర్ణాటకలో మహిళా పథకాలు విజయం అందించడంతో తెలంగాణలోనూ అవేతరహా పథకాలు తెస్తామంటూ కాంగ్రెస్ ఇటీవల హామీ ఇచ్చింది. ఇక 2016లో బీహార్ లో నితీష్ కుమార్ మధ్యపానం పై నిషేధం ప్రకటించడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు తెచ్చి ఆ ప్రతిఫలాన్ని 2020 ఎన్నికల్లో పొందారు. ఎన్నికల ప్రక్రియలో మహిళల ప్రాధాన్యం పాత్ర క్రమంగా పెరుగుతుండడం వల్లే రాజకీయ పార్టీలు సరికొత్తగా ఆలోచించడం మొదలుపెడుతున్నాయి. 2019 ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 67.2% మహిళలు ఓట్లు వేయగా.. 67 శాతం పురుషులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 2019_22 మధ్య మహిళల ఓట్లు 5.1 శాతం పెరిగాయి. పురుషుల ఓట్లు 3.6 శాతం మాత్రమే పెరగడం విశేషం. ప్రస్తుతం దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 46.1 కోట్లు. 2019లో ఇది 43.80 కోట్లు. ఇక పురుష ఓటర్లు 47.3 కోట్ల నుంచి 49 కోట్లకు పెరిగారు.