Modi Cabinet Reshuffle 2023: కేంద్రంలోని బిజెపిని గద్దె దించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఐక్యతా రాగం ఆలపిస్తున్నాయి.. మోదీకి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాయి. మాయావతి, కెసిఆర్, జగన్ మినహా మిగతావారు మొత్తం ఈ సమావేశానికి వచ్చారు. మోడీకి వ్యతిరేకంగా ఎటువంటి ప్రణాళిక అమలు చేయాలో నిర్ణయించారు. సీట్ల పంపకం, మిగతా విషయాలను తర్వాత చర్చిద్దామని నిర్ణయించారు. ఇక ప్రతిపక్షాల ఐక్యత వల్ల నష్టం చేకూరుతుందని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అమెరికా వేదికగానే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు సంకేతాలు ఇచ్చారు.. త్వరలో క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తామని తేల్చి చెప్పేశారు. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మోడీ వైపు టర్న్ తీసుకున్నాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మార్పు
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులూ మారనున్నారు. ఈ రెండు ప్రక్రియలను పరస్పరం ముడిపెట్టి ఏకకాలంలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర సీనియర్ నేతలు కలిసి పార్టీ పునర్వవ్యవస్థీకరణ, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి సీరియస్ గా చర్చించినట్లు తెలిసింది. అలాగే, వచ్చే ఎన్నికలకు ముందే ఎన్డీఏను విస్తరించి, ఒక కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలన్న విషయంపైనా నేతలు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల తాలూకు అంశాలన్నీ నివేదిక రూపంలో ఇప్పటికే ప్రధాని మోదీకి పంపినట్లు తెలిసింది. మోదీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆయన అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత.. ఈ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. లేదంటే జూలైలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోపు ఈ మార్పులు జరగవచ్చునని అంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్, కర్ణాటక, యూపీ, హిమాచల్, ఛత్తీస్ గఢ్, కేరళ రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులను మార్చాలన్న ప్రతిపాదనను బీజేపీ పెద్దలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఆ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం, పౌర విమానయాన శాఖ, ఆర్థికశాఖ, జలశక్తి, పర్యావరణం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ది, రైల్వే, క్రీడల శాఖలకు సంబంధించి మార్పులపైనా చర్చలు జరుగుతున్నాయి. ఒడిసాలో రైల్వే ప్రమాదంనేపథ్యంలో ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను తప్పించాలని, ఆయన్ను ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రెజ్లర్ల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో క్రీడల శాఖను నిర్వహిస్తున్న అనురాగ్ ఠాకూర్‌ను ఆ శాఖ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. న్యాయ,పార్లమెంటరీ శాఖలను చూస్తున్న అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు ఇటీవల అదనపు శాఖల బాధ్యత లూ అప్పగించారు. ఆయనకు అదనపు శాఖలనుంచి విముక్తి కలిగించే అవకాశాలున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులకు అదనపు బాధ్యతల నుంచి తప్పించొచ్చు. ఈ మేరకు రెండు శాఖలను మించి కలిగి ఉన్న మంత్రులు పీయూష్ గోయల్,కిషన్ రెడ్డి సహా పలువురికి అదనపు శాఖల నుంచి తప్పించి.. ఎన్నికల బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.