KP Chaudhary Case: కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు పెద్ద పెద్ద తప్పిదాలకు కారణమవుతాయి. అవే అసలు విషయాన్ని బయటపడతాయి. ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ లోనూ అదే జరిగింది. నిర్మాత కె.పి చౌదరి స్మార్ట్ ఫోన్లో ఉన్న వివరాలను డీకోడ్ చేసిన తెలంగాణ పోలీసులకు పలు విస్మయకర వాస్తవాలు తెలిశాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తుంటే పెద్ద పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి.. అంతే కాదు కేపీ చౌదరితో వారు జరిపిన ఫోన్ సంభాషణ, వాట్సప్ సందేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆషూ రెడ్డి ఓ ఫెడ్లర్
జూనియర్ సమంత గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆషూ రెడ్డి పలు మార్లు కేపీ చౌదరితో ఫోన్లో మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది. వాట్సాప్ సందేశాలు కూడా వారిద్దరి మధ్య జరిగాయి. ఆ సందేశాల్లో చాలావరకు ఒక కోడ్ లాంగ్వేజ్ వాడటం విశేషం.. పూరీ, చపాతీ, జ్యూస్ వంటి పదాలు వారి సందేశాల్లో కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి ఆషూ రెడ్డికి బిగ్ బాస్ తర్వాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అడపాదడపా టీవీ షో ల్లో కనిపించడం తప్పా.. పెద్దగా సినిమా అవకాశాలు కూడా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టిివ్ గా ఉంటున్నది. పార్టీ యానిమల్ అయిన ఈమె కె పీ చౌదరితో కొంతకాలంగా సాన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా వీరిద్దరూ కలిసి చాలా పార్టీలకు వెళ్లారని వారు పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఫోటోల ప్రకారం తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి వెళ్లిందని సమాచారం. ఇందులో భాగంగానే ఆషూ రెడ్డి ఆ అవతారం ఎత్తిందని ప్రచారం జరుగుతోంది.
ఆ పార్టీ పట్టించింది
ఇక హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉండే వర్ధమాన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇంట్లో ఇటీవల ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో కేపీ చౌదరి,ఆషూ రెడ్డి, ఇంకా కొంతమంది నటీనటులు హాజరయ్యారు. ఆ పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగిందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ డ్రగ్స్ కు సంబంధించి జరిగిన సంఘటన ఇంతటి కలకలానికి కారణమైందని తెలుస్తోంది. ఒక యువ సినీనటి కి డ్రగ్స్ సరఫరా విషయంలో వివాదం తలెత్తిందని, అది కాస్తా గొడవగా మారిందని, అదే కేపీ చౌదరిని పట్టించిందని ప్రచారం జరుగుతోంది. ఇక కేపీ చౌదరి ఫోన్లో ఉన్న నెంబర్లు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుంటే పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చినప్పుడు పోలీసులు రెండు మూడు రోజులు హడావిడి చేశారు. విచారణ పేరుతో టాలీవుడ్ ప్రముఖ సినీ నటులను పిలిచారు. తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? “పబ్ కి వెళ్ళి మిర్చి బజ్జీలు తిని వచ్చామని చెబితే” పోలీసులు సరేలే అని ఊరుకుంటారా? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.