Corona Alert: టిన్.. టిన్.. టీన్..యాత్రికోం కృపియా ధ్యాందీజియే.. ట్రెయిన్ నంబర్.. ప్లాట్‌ఫాం పర్ ఆ చుకిహే.. దేశంలో ఏ రైల్వే స్టేసన్‌కు వెళ్లినా వినిపించే అనౌన్స్‌మెంట్ ఇదే.. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు భారతీయ రైల్వే ఈ ప్రకటన చేస్తుంది. ఇలాంటి అనౌన్స్‌మెంట్‌ను ఇప్పుడు కేంద్రం దేశంలో పాదయాత్ర చేస్తున్న నేతలకు ఇవ్వబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రూపంలో కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ద్వారా అందింది.. ‘రాహుల్ జీ కృపియా ధ్యాందీజియే.. కోవిడ్–19 సబ్ వేరియంట్ బీఎఫ్7 హమారా దేశ్‌మే ఆచుకిహే.. ఆప్‌కీ యాత్ర బంద్ కరో’ అంటూ కరోనా సబ్ వేరియంట్ బీఎఫ్7 పై అప్రమత్తం చేసింది. ఇది ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.. కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్‌తోపాటు, పాదయాత్రలకు సిద్ధమవుతున్న నేతలు విమర్శలు చేస్తున్నారు.

మళ్లీ కోవిడ్ కలకలం
ఇప్పుడు మళ్లీ కొత్త వేరియంట్ కరోనా ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఇండియాలోనూ మూడు కేసులు నమోదయ్యాయని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. అయితే వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రి దృష్టి రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై పడింది. ఆయన నేరుగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కరోనా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి భారత్ జోడో యాత్ర ఆపేయాలని అందులో కోరారు.
విపక్షాలకేనా.. రూల్స్
కేంద్ర మంత్రి రాసిన లేఖ చూసి.. విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. కరోనా విపక్ష పార్టీల కార్యక్రమాలకే వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం కోవిడ్ అలర్ట్ ప్రకటించిన నేప£ý ్యంలో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో రాజ్యాంగం, రూల్స్ ఏవీ అధికార పార్టీలకు పని చేయవా అని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం తాము ఏం చేయాలనుకుంటే అవి చేసి.. రూల్స్ అనుగుణంగానే చేశామని ప్రకటించుకుంటుందని, విపక్షాలకు మాత్రం అవి చాలా కఠినంగా అమలవుతాయని విమర్శిస్తున్నారు. కరోనా సమయంలో జరిగిన అనేక పరిణామాలను ఈమేరకు ఉదహరిస్తున్నాయి.
అధికార పార్టీలన్నీ అంతే..
కేంద్రంలో మాత్రమే కాదు.. రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువ అని పలు రాష్ట్రాల విపక్ష నేతలు పేర్కొంటున్నారు. ర్యాలీలతో అధికార పార్టీ నేతలు హోరెత్తించేస్తారు.. కానీ విపక్ష నేతలకు మాత్రం చాన్సే ఉండదని అంటున్నారు. పది మంది గుమికూడినా కేసులు పెడతారని ఆరోపిస్తున్నారు.

ఎన్నికల కాలంలో ఆంక్షలా..?
వచ్చేది ఎన్నికల కాలమని.. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి కాబట్టే కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కోవిడ్ రూల్స్ పేరుతో విపక్షాలను కట్టడి చేయాలని చూస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు యాత్రలు.. లోకేష్ పాదయాత్రలు ప్రారంభం కానున్నాయి. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్, జేడీఎస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో రేవంత్ కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. వీరందర్నీ కరోనా పేరుతో అడ్డుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఏపీలో వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లేందుకు ఏ అడ్డంకి రాదని టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. వారు ఇష్టారీతిన ర్యాలీలు నిర్వహిస్తారు.
మొత్తంగా కరోనా కేసుల పెరుగుదల ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీలకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.