India vs Bangladesh 2nd Test: బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీపే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది.. మొదటి టెస్ట్ గెలిచిన ఉత్సాహంతో.. రెండో టెస్టులోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం ప్రారంభమైన రెండు టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆల్ ఔట్ అయింది. భారత బౌలర్లలో ఉమేష్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసుకుని బంగ్లాను వణికించారు.

ఆరంభం నుంచే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నమోదు చేయలేదు. స్వల్ప స్కోర్ లకే బ్యాట్స్ మెన్ వెనుతిరిగారు. 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్… ఏ దశలోనూ భారత బౌలర్లను ప్రతిఘటించలేదు. ఆ జట్టులో మామినుల్ హక్ మాత్రమే 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు కనుక నిలబడకపోయి ఉంటే బంగ్లాదేశ్ మరింత తక్కువ స్కోరు నమోదు చేసేది. శాంటో, హసన్, షకీబ్ ఉల్ హాసన్, ముష్పిఖర్ రహీం, లిటన్ దాస్, హాసన్ మిరాజ్, నురూల్ హసన్ ఎవరూ కూడా 30 లోపు పరుగులు కూడా చేయలేదంటే ఎంత దారుణంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
షకీబ్ కు తెలియదా
టెస్ట్ ఆడుతోంది బంగ్లాదేశ్ లో. ఆ దేశంలో పిచ్ లు ఎలా ఉంటాయో కెప్టెన్ అయిన షకీబ్ కు తెలిసి ఉంటుంది. పైగా మొదటి టెస్టులో ఓడిపోయింది.. పిచ్ కూడా స్పిన్ ట్రాక్ కు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెప్పాడు. కానీ షకీబ్ బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. అతడు బ్యాటింగ్ ఎంచుకొని ఎంత తప్పు చేసాడో తర్వాత కాని అర్థం కాలేదు. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆల్ అవుట్ అయిన బంగ్లాదేశ్.. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 77 పరుగులు ఎక్కువ చేసింది. ఇది ఒకటే బంగ్లాదేశ్ కు సానుకూల అంశం.

ఇరగదీశారు
మొదటి టెస్ట్ హీరో కులదీప్ యాదవ్ ను పక్కన పెట్టిన టీమిండియా ఈ మ్యాచ్లో స్పిన్ భారం మొత్తం అశ్విన్ పై వేసింది. అయితే మొదట్లో అతడు అంతగా ప్రభావం చూపలేదు. లంచ్ తర్వాత బంగ్లాదేశ్ కు సినిమా చూపించాడు. అతడికి ఉమేష్ యాదవ్ తోడు కావడంతో.. బంగ్లాదేశ్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.. నాలుగో వికెట్ కు జోడించిన 48 పరుగులే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ అంటే భారత బౌలర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. చివరి నాలుగు వికెట్లను బంగ్లాదేశ్ కేవలం 14 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.. అయితే తొలి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసిన హైదరాబాద్ సంచలనం మహమ్మద్ సిరాజ్… ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం.