Tollgate : రహదారుల నిర్మాణం.. నిర్వహణకు అయ్యే డబ్బులను ప్రజల నుంచే వసూలు చేసేందుకు కేంద్రం టోల్ చార్జీ విధానం అందుబాటులోకి తెచ్చింది. జాతీయ రహదారులు లేదా రాష్ట్ర రహదారులు, వంతెనలు, సొరంగాలు, ఎక్స్‌ప్రెస్ వేల మీదుగా ప్రయాణం చేసినప్పుడు వసూలు చేసే చార్జీని టోల్ చార్జీ అంటారు. దీనిని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయిస్తుంది. రోడ్ల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతుల కోసం స్థిరమైన రాబడి కోసం ఈ టోల్ వసూలు చేస్తుంది. టోల్ చార్జీల పెంపు, ఉప సంహరణను నేషనల్ హైవే అథారిటీ నిర్ణయిస్తుంది. మొదట టోల్ చార్జీల వసూలు కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వసూలు చేసేవారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ పెరిగిపోవడంతో కేంద్రం పాత విధానానికి స్వస్తి పలికి ఫాస్టాగ్ విధానం అమలులోకి తెచ్చింది. హైరెజల్యూషన్ కెమెరాలతో ఫాస్టాగ్ కార్డులను స్కాన్ చేయడం ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ విధానం కొనసాగుతోంది. అయితే ఈ విధానం కూడా ట్రాఫిక్ సమస్యకు సరైన పరిష్కారం చూపలేదు. మరోవైపు ప్రయాణంతో సంబంధం లేకుండా అసంద్దంగా టోల్ చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టోల్ బూత్‌లను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే టోల్ వసూలు మాత్రం ఆగదండోయ్.. ఇందు కోపం శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు చేయబోతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టే పన్నులు, సుంకాలు, టోల్ వసూళ్లలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఎంతో ఖర్చుతో నిర్మించే జాతీయ రహదారులు, ‘ఎక్స్‌ప్రెస్ వే’ల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేయడం అందరికీ తెలిసిన విషయమే.
ప్రారంభంలో నగదు రూపంలో..
టోల్ వసూలు ప్రారంభంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈ కారణంగా టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలిపి ఉంచాల్సిన పరిస్థితులు తలెత్తేవి. మరోవైపు దొంగలు, దోపిడీ ముఠాలు టోల్ గేట్లను లక్ష్యంగా చేసుకుని వసూలు చేసిన సొమ్మును దోచుకుపోయేవారు. కాలక్రమంలో క్రెడిట్ / డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. చిల్లర నగదు తిరిగిచ్చే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని కార్డుల ద్వారా చెల్లింపులు నివారించినప్పటికీ, ఇది కూడా వేగవంతమైన చెల్లింపుల విధానంగా నిలబడలేకపోయింది. అయితే కార్డు ద్వారా చెల్లించే సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరడంతో దోపిడీ ముఠాల బెడద కొంతమేర తగ్గింది. ఇక ప్రస్తుతం అమలవుతున్న ‘ఫాస్టాగ్’ విధానంతో చిల్లర నగదు, వసూలు చేసిన సొమ్ముకు భద్రత వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవడంతోపాటు వాహనాలు వేగంగా టోల్ గేటు దాటుకుని ముందుకెళ్లేందుకు ఆస్కారం కలిగింది.
అసంబద్ధంగా వసూలు..
అయితే టోల్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా చెల్లింపులు జరగడం లేదు. టోల్‌గేట్ దాటిన వెంటనే గమ్యం చేరేవారైనా, మరో టోల్ గేట్ కంటే ముందు గమ్యం చేరినవారైనా ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సి వస్తోంది. జాతీయ రహదారులపై సగటున ప్రతి 60 కి.మీ దూరానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రతి టోల్ గేట్ వద్ద నిర్ణీత సొమ్ము వసూల్ అవుతుంది. ఒక కారు 61కి.మీ ప్రయాణించినా, 119 కి.మీ ప్రయాణించినా ఒకే మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది. ఈ తారతమ్యాలను సరిదిద్దేందుకు కేంద్రం ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లింపులు జరిపేలా సరికొత్తగా శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది.
జీపీఎస్ – శాటిలైట్ టోల్
ఈ సరికొత్త విధానాన్ని గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌గా వ్యవహరిస్తారు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు – మైసూర్ మధ్య ఉన్న నేషనల్ హైవే–275 తో పాటు హర్యానాలోని పానిపట్ – హిస్సార్ మధ్య ఉన్న నేషనల్ హైవే 709పై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ మొత్త టోల్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరికీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు జూన్ 25న వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు. అలాగే గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం జూన్ 7 నుంచే ఆహ్వానాలు స్వీకరించడం ప్రారంభించామని, జులై 22తో గడువు ముగిసిందని చెప్పారు. అంటే త్వరలో టోల్ గేట్ల వ్యవస్థ దేశంలో కనుమరుగు కానుంది. ప్రయాణించిన దూరానికి తగిన సొమ్ము వాహనదారుల ఖాతా నుంచి కట్ అవుతుంది.
శాటిలైట్ ద్వారా లెక్క..
ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. అసలు రహదారిపై టోల్ గేట్లే ఉండవు. వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కగడుతుంది. జాతీయ రహదారి నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి. అయితే ఇదంతా జరగడానికి ప్రతీ వాహనానికి సరికొత్త జీపీఎస్ నంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. రహదారులపై ఏర్పాటు చేసే కెమెరాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ వ్యవస్థ ఉంటుంది. వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమెురాలు స్కాన్ చేసి శాటిలైట్‌కు సమాచారం పంపిస్తాయి. తద్వారా వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ – జీపీఎస్ వ్యవస్థ లెక్కిస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More