BRS In AP: తనకు గిట్టని ప్రధాని నరేద్రమోదీకి ముఖం చూపడానికి కూడా భయపడుతన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు.. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఎన్నికల సంఘం కూడా దీనికి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 14 ఢిల్లీలో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. దక్షిణాదిన పుట్టిన పార్టీ అయినందున మొదట ఉత్తరాదిన విస్తరించాలనుకుంటున్నారు. ఉత్తరాదిన ఢిల్లీలో, దక్షిణాదిలో ఏపీలో పార్టీ విస్తరణ సులభమని గలాబీ బాస్ భావిస్తున్నారు.

ఏపీ బాధ్యతలు తలసానికి..
ఏపీలో బీఆర్‌ఎస్ విస్తరణ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కేసీఆర్ అప్పగించారు. ఏపీలో ఆయనకు ఉన్న బంధుత్వాల కారణంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఏపీ సమస్యలపై ఇప్పుడు ఏదో విధంగా ప్రతిస్పందించకపోతే.. అనుకున్నంత ఎఫెక్ట్ రాదు. ఏపీలో ఇప్పుడు ప్రధానమైన సమస్య.. అమరావతి లేదా మూడు రాజధానులు. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ గతంలో మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ అయింది. బీఆర్‌ఎస్ ఏపీలోనూ రాజకీయం చేయబోతోంది. ఇలాంటి సమయంలో అదే విధానానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే.. అమరావతికి మద్దతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు.. అమరావతికే మద్దతు ప్రకటించాయి. బీజేపీ, కాంగ్రెస్ కూడా అమరావతికే మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులంటోంది. ఇప్పుడు వైసీపీ వైపు కేసీఆర్ ఉంటారా లేకపోతే.. అమరావతి వైపా అన్నది తేల్చుకుంటే.. పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేసుకున్నట్లే.

ఢిల్లీలో అమరావతి రైతుల ధర్నా..
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అమరావతి రైతులు కూడా ధర్నా చేయడానికి ఢిల్లీ చేరుకుంటున్నారు. శనివారం వారు జంతర్ మంతర్‌లో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ హాజరై మద్దతు పలికితే.. ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీకి బీజం పడినట్లే అవుతుంది. ఎందుకంటే ఇటీవలే తమ ఏపీ బీఆర్‌ఎస్ ఆఫీసు విజయవాడలోనే ఉంటుందని చెబుతున్నారు. ఓ రకంగా అది సంకేతం అనుకోవచ్చు. ఒక వేళ ఢిల్లీలోనే ఉండి.. ఏపీ రైతులు.. ఓ సమస్యపై వచ్చి అక్కడే పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోతే.. కేసీఆర్ జాతీయ నాయకుడిగా తొలి అడుగుల్లోనే తడబడుతున్నట్లుగా అనుకోవచ్చు.
దేశ రాజధానిపై దృష్టి..
మరోవైపు దేశరాజధాని ఢిల్లీపైనా కేసీఆర్ దృష్టిపెట్టారు. చిన్న రాష్ట్రం కావడం, పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలోనే ఉన్నందున ఢిల్లీలోని కొంతమంది నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈమేరకు మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ సభ్యుడు కేకే ఈ బాధ్యతలు చూసుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఆ పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
ఏపీలో పార్టీ విస్తరణకు కలిసి వచ్చిన అమరావతి రైతుల ధర్నా అంశాన్ని కేసీఆర్ ఎలా వినియోగించుకుంటారో చూడాలి మరి.