BRS: ఇంట గెలవాలలేదు మరీ.. అందుకే ‘రచ్చ’ వదిలేసిన బీఆర్ఎస్!

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్‌.. మహారాష్ట్ర రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 400 కార్ల కాన్వాయ్‌తో మహారాష్ట్రకు వెళ్లారు. ఐదారు సభలు నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : January 3, 2024 1:06 pm

BRS

Follow us on

BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలి.. తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి కనీసం 50 ఎంపీ సీట్లు గెలవాలి.. తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలి.. వీలైతే ప్రధాని పీఠం అధిష్టించాలి.. ఇదీ ఏడాది క్రితం వరకు భారత రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన. తాను ప్రధాని అయితే.. రాష్ట్రంలో యువరాజు కేటీఆర్‌ను సీఎం అవుతాడు అని కలలు కన్నాడు. కానీ.. నోరు ఒకటి తలిస్తే.. నొసలు ఇంకోటి తలుస్తుందట తలుస్తుంది అన్నట్లు.. కేసీఆర్‌ కలలు పటాపంచలయ్యాయి. గాలి మేడలు నేల కూలాయి.. గడీలు బద్ధలయ్యాయి. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల ఊసే ఎత్తడం లేదు.

మహారాష్ట్రకే ప్రాధాన్యం..
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్‌.. మహారాష్ట్ర రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 400 కార్ల కాన్వాయ్‌తో మహారాష్ట్రకు వెళ్లారు. ఐదారు సభలు నిర్వహించారు. తెలంగాణ బంగారు తెలంగాణ అయింది.. మహారాష్ట్రను కూడా బంగారు మహారాష్ట్ర చేస్తానని హామీలు ఇచ్చారు. పింఛన్లు పెంచుతామన్నారు. ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు. మహారాష్ట్ర కోసం ఓ ప్రత్యేక ప్రణాళికే రూపొందించుకున్నారు గులాబీ బాస్‌. వివిధ పార్టీల నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చేర్చుకున్నారు.

కార్యాలయాలు..
ఇక పార్టీ కార్యకలాపాల కోసం మహారాష్ట్ర ఇన్‌చార్జిగా తన బంధువును నియమించారు. వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. నాగపూర్‌లో కార్యాలయం ప్రారంభానికే 400 కార్ల కాన్వాయ్‌తో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి మంచి స్పందన వస్తుందని లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 30 సీట్లు గెలుస్తామని లెక్కలు కూడా వేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారని ప్రచారం కూడా చేశారు.

ఇప్పుడు అంతా నిశ్శబ్దం..
అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన కేసీఆర్‌.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. తెలంగాణనే ఇంత అభివృద్ధి చేశామని అక్కడ ఊదరగొట్టి.. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓడిపోవడంతో తల ఎత్తుకోలేని పరిస్థితి. మహారాష్ట్ర వాసులకు ఏం చెప్పాలో అర్థం కాని సంకట స్థితిలో కేసీఆర్‌ ఉన్నారు. మరోవైపు చేరికలు ఆగిపోయాయి. తెలంగాణ వాసులకు తెరుచుకోని ప్రగతి భవన్‌ గేట్లు.. నాడు ఇతర రాష్ట్రాల వారికి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసీఆరే ప్రగతి భవన్‌ ఖాళీ చేశారు. దీంతో మహారాష్ట్ర నేతలు ఇటువైపు కూడా చూడడం లేదు. కేసీఆర్‌ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు.

త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌
పరిస్థితి చూస్తుంటే త్వరలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదల అవుతుందని బీజేపీ నేతలే చెబుతున్నారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. తమది కూడా జాతీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్‌.. మాత్రం మహారాష్ట్రలో పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్‌ మహారాష్ట్రపై చేతులు ఎత్తేసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ పోటీ చేసినా ఓడిపేతో.. పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.