https://oktelugu.com/

Zomato: పెట్రోల్ లేదు మరీ.. గుర్రంతో జొమాటో డెలివరీ.. వైరల్ వీడియో

పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరి ఉండటం.. తన వాహనంలో పెట్రోల్ అయిపోవడం.. పైగా వరుసగా ఆర్డర్లు వస్తుండటంతో ఓ జొమాటో డెలివరీ బాయ్ వినూత్నంగా ఆలోచించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 3, 2024 / 01:02 PM IST

    Zomato

    Follow us on

    Zomato: కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల తమ బతుకులు రోడ్డుమీద పడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిన్నంతా దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల పెట్రోల్ బంకులల్లో చమురు నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. ఇక హైదరాబాదులో అయితే పలుచోట్ల వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. పెట్రోల్ బంకుల ఎదుట విపరీతమైన రద్దీ ఏర్పడింది. కొందరైతే క్యాన్లు పట్టుకొచ్చి పెట్రోల్ కోసం క్యూలో నిలుచున్నారు. అయితే ఈ రద్దీని తట్టుకోలేక జొమాటో డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరి ఉండటం.. తన వాహనంలో పెట్రోల్ అయిపోవడం.. పైగా వరుసగా ఆర్డర్లు వస్తుండటంతో ఓ జొమాటో డెలివరీ బాయ్ వినూత్నంగా ఆలోచించాడు. తనకు తెలిసిన వారి గుర్రం మీద ఆ ఫుడ్ ఆర్డర్ తీసుకొని డెస్టినేషన్ పాయింట్ దగ్గర డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. హైదరాబాదులో రద్దీ గా ఉండే రోడ్లమీద గుర్రాన్ని దౌడు తీయించి చాంద్రాయణ గుట్ట వద్ద కస్టమర్ కు డెలివరీ ఇచ్చాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇంకేముంది దెబ్బకు చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఈ వీడియోను అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాలకే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు ఆ డెలివరీ బాయ్ ని రాత్రికి రాత్రే హీరోని చేసింది.

    ఈ వీడియో చూసిన కొంతమంది రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కస్టమర్ పిజ్జా ఆర్డర్ ఇస్తే.. అతని వద్దకు చేరుకునేసరికి అది కిచిడి అయిపోతుందని ఒకతను కామెంట్ చేశాడు. పెట్రోల్ దగ్గర రద్దీ ఉందని గుర్రం మీద వెళ్తున్నాడు అంటే ఇతడు రిచ్ జొమాటో బాయ్ అయి ఉంటాడని ఓ యువతి కామెంట్ చేసింది. జొమాటో చేసే ఏ పని అయినా అతిగానే ఉంటుందని ఓ యువకుడు వ్యాఖ్యానించాడు. గుర్రం మీద డెలివరీ ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదని మరో యువతి కామెంట్ చేసింది. గుర్రం మీద అతడు డెలివరీ ఇస్తుంటే.. చూసే వాళ్లకు మాత్రం అదోరకంగా అనిపిస్తోంది అని ఓ యువకుడు కామెంట్ చేశాడు. మొత్తానికి నిన్న ఒక్కరోజు పెట్రోల్ లభించకపోతేనే దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంచెం అతి అయినప్పటికీ జొమాటో డెలివరీ బాయ్ చేసిన ప్రయత్నం భవిష్యత్తు కాలంలో పెట్రోల్ నిండుకుంటే మన పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని కళ్ళ ముందు కనిపించేలా చేసింది.