
BRS cheats women : ఓవైపు మహిళలకు 33% రిజర్వేషన్ కోసం కవిత పోరాటం చేస్తుంది. మరోవైపు మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నామని కేటీఆర్ చెప్తుంటాడు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేసే పనులకు, ప్రజా ప్రతినిధులు చెప్పే మాటలకు పొంతన ఉండదు. కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మహిళా దినోత్సవం రోజు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి కొత్త ఎత్తుగడకు రంగం సిద్ధం చేసింది. కానీ అసలు విషయం తెలిసి మహిళలు తూర్పారపట్టడంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నది.
మోసం చేశారు
ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు అన్నట్లుంది స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ మంజూరు తీరు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో వడ్డీ రాయితీ బకాయి రూ.4,500 కోట్లుంటే తాజాగా రూ.750 కోట్లు విడుదల చేసింది. కేవలం 16 శాతం బకాయిలనే ఇచ్చింది. ఇంకో చిత్రమేమంటే.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో 3,99,120, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో 1,81,225.. మొత్తం 5.80 లక్షల సంఘాలుండగా, ఇప్పుడు విడుదల చేసిన రాయితీ 2.60 లక్షల సంఘాలకే అందనుంది. ఈ లెక్కన 44 శాతం సంఘాలకే ఉపశమనం దక్కనుంది. కాగా, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో వడ్డీ లేని రుణ పథకం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని పేర్కొంది. అయితే, రూ.5 లక్షలకు పైగా తీసుకునే రుణాలకు వడ్డీ చెల్లించడం లేదు. ఈలోపు ఉన్నవారికీ నాలుగేళ్లుగా ఇవ్వడమే లేదు.
ఏళ్ళు గడుస్తున్నా ఎదురుచూపులే
మహిళలు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి ఖాతా తెరచి క్రమం తప్పకుండా పొదుపు చేస్తే బ్యాంకు రుణం ఇస్తుంది. సభ్యులు తలా కొంత నగదు తీసుకొని స్వయం ఉపాధికి ఉపయోగించుకుంటారు. నెలవారీ వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తారు. వీరు కట్టిన వడ్డీని 3నెలలకు ఓసారి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన డబ్బును బ్యాంకులో ఉన్న మొత్తం రుణంలో తగ్గిస్తారు. కానీ.. నాలుగేళ్లుగా సర్కారు నుంచి రాయితీ జమ కావడం లేదు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించడంతో.. కష్టాలకోర్చి బ్యాంకులకు వడ్డీ సొమ్ము చెల్లించిన వారంతా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎన్నికల ఏడాది కావడంతో పూర్తి వడ్డీ సొమ్ము తిరిగి వస్తుందని ఆశ పెట్టుకుంటే అడియాశే అయింది. బ్యాంకులు మాత్రం సంఘాల నుంచి ప్రతి నెల వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ నిబంధనలు
స్వయం ఉపాధికి రుణాలు తీసుకున్న మహిళలను ప్రభుత్వ నిబంధనలు ఇబ్బందిపెడుతున్నాయి. రుణ వాయిదా చెల్లింపు ఒక్క రోజు ఆలస్యమైనా ఆ నెలకు సంబంధించి వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఇంతగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం వడ్డీ రాయితీని మాత్రం వారి ఖాతాల్లో వేయలేకపోతోంది. కాగా, రాష్ట్రంలోని మహిళా గ్రూపులకు బ్యాంకులు 10-12.5 శాతం వడ్డీతో ఏటా రూ.15వేల కోట్ల వరకు రుణాలిస్తున్నాయి. ఈ ఏడాది రూ.18వేల కోట్లు రుణ లక్ష్యం నిర్ణయించారు.