
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయ్యాక పార్టీకి మంచి ఊపు వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టైమ్‌ను.. సందర్భాన్ని బట్టి ఆయన ప్రభుత్వం పై ఫైర్ అవుతూనే ఉన్నారు. సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. అయితే.. అప్పుడప్పుడు ఆయన వ్యవహారశైలి.. ఆ పార్టీ నేతలను షాక్‌కు కన్నా ఎక్కువగా విస్మయానికి గురిచేస్తోంది.
టీడీపీ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని.. తక్షణం కేసులు పెట్టాలని సోము ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఆయన లేఖ రాయడమే ఆలస్యం.. సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. రెడ్డి ఎమ్మెల్యే అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన సీఐడీ.. సోము వీర్రాజు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టకపోవడంలో వింత లేదు. కానీ.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సోము వీర్రాజు ఫిర్యాదు చేసింది ఎవరిపైనా అని తరచి చూస్తే బీజేపీ నేతలకూ తేడాగా అనిపిస్తోంది. సోము ఫిర్యాదు చేసింది సొంత పార్టీ నేత కామినేని శ్రీనివాస్ పైనే.
అవును.. టీడీపీ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నాలుగేళ్లు బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే వ్యవహారాలన్నీ నడిచాయి. ఇప్పుడు అదే శాఖపై ఆరోపణలు చేస్తూ సోము వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాసి.. కేసు నమోదవడానికి కారణంగా నిలిచారు. 2015 నుంచి వైద్య, ఆరోగ్య శాఖ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై అన్ని స్థాయిలలో ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై విచారణ కూడా జరిగింది. అక్రమాలపై ప్రాథమిక నిర్ధారణ కూడా జరిగింది. తదుపరి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు ఆ కేసును సోము వీర్రాజు కదిలించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నామని బీజేపీ నేతలు అనుకుంటూ ఉంటారు కానీ.. అది ఉమ్మడి ప్రభుత్వం అనే సంగతిని మర్చిపోయారని పలువురు అంటున్నారు. టీడీపీ మీద రాళ్లేస్తున్నామని అనుకుంటున్నా.. అది తమ సొంత పార్టీ నేతలకే తగులుతున్నాయని ఆలోచించలేకపోతున్నారు. ఆయన గతంలో దేవాదాయశాఖపై చేసేవారు. అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కార్నర్ అయ్యేవారు. ఆయన కరోనాతో చనిపోవడంతో ఇప్పుడు కామినేని సంగతి చూస్తున్నారు. అయితే.. వైసీపీ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకే సోము వీర్రాజులేఖ రాశారని లేకపోతే ఇప్పుడు లేఖ రాయాల్సిన సందర్భమే లేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. మొత్తంగా సోము ఎపిసోడ్ కాస్త సొంత పార్టీ నేతలనే ఆపదలో పడేసే ప్రమాదం తేనుంది.