Praja Sangrama Padayatra: తెలంగాణలో బీజేపీ స్వరం పెంచుతోంది. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఇదివరకే మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 14 నుంచి రెండో విడత యాత్ర నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీంతో పార్టీ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. యాత్రను విజయవంతం చేసి కేసీఆర్ కు మరో సవాలు విసరాలని చూస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి జవసత్వాలు నింపేందుకు బండి సంజయ్ ఉపక్రమిస్తున్నారు.
ప్రజాసంగ్రామయాత్ర ద్వారా కార్యకర్తల్లో జోష్ నింపుతూ వారిని వచ్చే ఎన్నికలకు సంసిద్ధులను చేయడానికే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో చేపట్టే యాత్రకు సంఘీభావంగా పాల్గొనాలని కోరారు.దీనిపై సానకూలంగా స్పందించిన నడ్డా తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణలో పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో భాగంగా తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పడం విశేషం.
Also Read: Sri Lanka Crisis 2022: శ్రీలంక దుస్థితికి చైనాయే ప్రధాన కారణమా?
దీంతో రెట్టించిన ఉత్సాహంతో సంజయ్ కదనరంగంలోకి దూకనున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టనున్నారు.కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కార్యకర్తల్లో సఖ్యత నింపనున్నారు. ఇందుకు గాను పూర్తిస్థాయిలో అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆహ్వానించారు.దీంతో బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర నాయకుల పర్యటనలకు కూడా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభినున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చేపడుతున్న పథకాలపై కూడా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ అవినీతి పాలన గురంచి ప్రధానంగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ మరో అడుగు ముందుకేసి పాదయాత్ర ద్వారా అధికార పార్టీ విధానాలు ప్రజలకు వివరించి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరనున్నారు.
తెలంగాణలో అధికారం కోసం అధిష్టానం కూడా దృష్టి సారించింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి టీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాసంగ్రామ యాత్ర తో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయని తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ సంచలన వ్యాఖ్యలు