BJP Suresh Rathod:రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలను కొనసాగించే విషయంలో వారు అత్యంత జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలే రాజకీయ నాయకుల ప్రస్థానాన్ని నిర్ణయిస్తుంటాయి. చాలామంది రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత సంబంధాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వారి రాజకీయ ప్రస్థానాన్నే పూర్తిగా మార్చేశాయి. వ్యక్తిగత సంబంధాల విషయంలో గోప్యతను పాటించకపోవడం వల్ల చాలామంది రాజకీయ నాయకులు తమ పొలిటికల్ కెరియర్ నాశనం చేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ జాబితాలోకి ఉత్తరాఖండ్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ చేరారు. ఆయన వ్యక్తిగత జీవిత విషయంలో చోటు చేసుకున్న సంఘటనలు రాజకీయంగా సంచలనానికి దారి తీశాయి. మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహార శైలిని అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే ప్రశ్నించడంతో.. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే సురేష్ ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. దీంతో సురేష్ రాజకీయ జీవితం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవడం.. ఇప్పుడు పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
సురేష్ కు గతంలోని వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆయన సినీనటి ఊర్మిళా సనావర్ తో సన్నిహితంగా ఉంటున్నారు. మొదటి భార్య దగ్గరికి వెళ్లకుండా.. ఊర్మిళ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఆయన మొదటి భార్య కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. మీడియా ఎదుటికి వచ్చి సురేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే సురేష్ ఇటీవల ఊర్మిలను వివాహం చేసుకున్నారు. ఇది అక్కడికి కాంగ్రెస్ పార్టీకి అనుకోని వరం లాగా మారింది. వెంటనే విమర్శలు మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ నాయకులు చట్టాలను తీసుకొస్తారని.. కానీ వాటిని మాత్రం అనుసరించరని మండిపడింది.
సురేష్ ఊర్మిళ వివాహం చేసుకోవడం సరైన విధానం కాదని.. అది యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని అవహేళన చేయడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో వివరణ ఇవ్వాలని సురేష్ ను కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వెంటనే సురేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు సంవత్సరాల పాటు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు. దీంతో సురేష్ రాజకీయ జీవితం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.
ఊర్మిళను వివాహం చేసుకోవడం వల్ల సురేష్ యూనిఫాం సివిల్ కోడ్ ను అతిక్రమించారని.. కేంద్రం ఎంతో గొప్పగా తీసుకొచ్చిన చట్టాన్ని ఆయన అవహేళన చేశారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లే సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. పార్టీ అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సురేష్ తదుపరి రాజకీయ కార్యాచరణను ప్రారంభిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.. అయితే ప్రస్తుతం సురేష్ తన రెండో భార్యతో ఉంటున్నారు. ఆయన వివరణ తీసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రావడం లేదు.