AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడు( AP BJP Chief ) ఖరారు అయ్యాడా? హై కమాండ్ ఇప్పటికే ఓ పేరు సూచించిందా? ఆయన ఒక్కరే అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారా? ఈ మేరకు ఆదేశాలు వచ్చాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపి అధ్యక్ష పదవికి సంబంధించి ఈరోజు నామినేషన్లు స్వీకరించనున్నారు. రేపు ఎన్నిక జరిపించేందుకు బిజెపి హై కమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ బాధ్యులు రంగంలోకి దిగారు. అయితే ఆశావాహులు ఎక్కువమంది ఉన్నారు. అయితే పేరుకే ఎన్నిక కానీ బిజెపి హై కమాండ్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఒక పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓ బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో ఏమైనా భారీ మార్పులు జరిగితే తప్ప.. ఆ బీసీ నేత పేరు ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తోంది.
Also Read: యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్.. పూర్ణచందర్ భార్య బయటపెట్టిన సంచలన నిజాలు
* ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యం..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బిజెపి హై కమాండ్( BJP high command ) భావిస్తోంది. తెలంగాణలో ఈ నినాదం వర్కౌట్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం కలిగింది. అందుకే 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో ఏపీలో సైతం బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురానుంది. బీసీల్లో పట్టు సాధించడం ద్వారా ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా బీసీ వర్గానికి చెందిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చింది. అదే సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఆర్ కృష్ణయ్య, పాక సత్యనారాయణ లకు ఛాన్స్ కల్పించింది. ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం బీసీ నేత పివిఎన్ మాధవ్ కు ఇవ్వాలని ఫైనల్ గా డిసైడ్ అయింది.
* కొత్త ప్రయోగం..
ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. బిజెపి భాగస్వామ్య పక్షాలైన టిడిపి( Telugu Desam Party), జనసేన కు వేర్వేరు సామాజిక వర్గాలు అండదండగా ఉన్నాయి. టిడిపికి కమ్మ, జనసేనకు కాపు వర్గాలు అండగా ఉంటున్నాయి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అండగా ఉంటుంది. ఈ తరుణంలో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు బిజెపి ఈ కొత్త ప్రయోగానికి తెరతీసినట్లు సమాచారం. ఈసారి బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇస్తే ఏపీలో పార్టీ కొంతవరకు బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అందుకే పివిఎన్ మాధవ్ వైపు బిజెపి హై కమాండ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
* బలమైన బీసీ నేతగా
ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ఉన్నారు మాధవ్( Madhav). ఆయన తండ్రి చలపతిరావు బిజెపికి సుదీర్ఘకాలం సేవలందించారు. ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉండేవారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల హడావిడి ప్రారంభం అయింది. కానీ హై కమాండ్ నుంచి మాత్రం మాధవ్ పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. ఆయన ఒక్కరితోనే నామినేషన్ వేయించి అధ్యక్ష పదవి ఆయనకే ఇచ్చేందుకు బిజెపి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.