Bilkis Bano Gang Rape Case : గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడం వివాదాస్పదమైంది. అత్యాచార కేసులో దోషులను..ఈ విధానం కింద విడుదల చేయరాదని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్ సర్కారు క్షమాభిక్ష పెట్టింది.ఈ అంశం ప్రస్తుతం దుమారం రేపింది.
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు జైలు నుండి విడుదలైన ఒక రోజు తర్వాత, గోద్రా సబ్-జైలు వెలుపల కొంతమంది వ్యక్తులు-వారి కుటుంబ సభ్యులు విడుదలైన వారి పాదాలను తాకడం మరియు వారికి స్వీట్ అందించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్ ప్రభుత్వం తమ రిమిషన్ పాలసీ ప్రకారం విడుదలకు అనుమతించడంతో దోషులు సోమవారం జైలు నుంచి బయటకు వచ్చారు.
బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం మరియు హత్య చేసిన ఆరోపణపై 2008 జనవరి 21న ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది.
ఈ దోషులు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులను విడుదల చేసేందుకు కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
మార్చి 3, 2002న గోద్రా అనంతర అల్లర్ల సమయంలో దాహోద్ జిల్లాలోని లిమ్‌ఖేడా తాలూకాలోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యులపై ఒక గుంపు దాడి చేసింది.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన హింసాకాండ నుంచి తప్పించుకుంటున్న సమయంలో బిల్కిస్ బానో 21 ఏళ్లు, ఐదు నెలల గర్భిణి. ఆమెను, వారి కుటుంబ సభ్యులను రేప్ చేసి దారుణంగా చంపారు.
ఈ కేసులో జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్ మరియు రమేశ్ చందనా అనే 11 మంది ఖైదీలకు జీవిత ఖైదు పడగా తాజాగా గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేశారు.
దోషుల్లో ఒకరైన శైలేష్ భట్ మంగళవారం మాట్లాడుతూ వారు “రాజకీయ బాధితులు” అని అన్నారు. “మేము 2004లో అరెస్టయ్యాము. 18 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాము. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది. మేము తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. నా కొడుకు అప్పుడు ఎనిమిది లేదా తొమ్మిదేళ్లు, ఇప్పుడు అతను పెద్దవాడు మరియు పంచమహల్ డెయిరీలో పనిచేస్తున్నాడు. ”అని ఎమోషనల్ అయ్యారు.
రేప్ చేసి చంపి జీవిత ఖైదు పడ్డ వారిని విడుదల చేయడం దుమారం రేపుతుంటే వారు ఏకంగా స్వీట్లు పంచుకొని పండుగ చేసుకోవడం బాధితుల కడుపు మండేలా ఉంది. ఈ వీడియో చూసి గుజరాత్ సర్కార్ తీరుపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. నిందితులను విడుదల చేసే పద్ధతి ఇదేనా? అంటూ మండిపడుతున్నారు.