Vijaya Devarakonda: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో లక్ అనేది ఒకేసారి వస్తుంది. అది అందిపుచ్చుకుంటే అందలం ఎక్కుతారు. దరిద్ర దేవత తలమీద కూర్చుంటే అథ: పాతాళానికి పడిపోతారు. సినిమాల్లో ఓవర్ నైట్ స్టార్లు అయినవారు ఉన్నారు. ఓవర్ నైట్ కనుమరుగైనవారు ఉన్నారు.
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు విజయ్ దేవరకొండ.. అందులో హీరోలుగా చేసిన వారు ఇండస్ట్రీలోనే లేకుండా పోగా.. మన విజయ్ దేవరకొండకు కాలం కలిసి వచ్చి ఏకంగా ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే తాను ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడ్డానని.. సినిమాల్లో అవకాశాల కోసం చేయని పనులు లేవని విజయ్ దేవరకొండ తన గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.
విజయ్ నటించిన ‘లైగర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న ఈ రౌడీ హీరో తాను సినిమాల్లో అవకాశాల కోసం.. నటుడిగా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాల కోసం తేజ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశానని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను అప్పుడు ఎంతో కష్టపడ్డానని.. ఈ స్థాయికి వస్తానని ఊహించలేదన్నారు.
పూరి జగన్నాథ్ దగ్గర సహాయ దర్శకులకు మంచి సాలరీలు ఇస్తారని నాన్న చెప్పడంతో ఒకసారి వెళ్లానని.. కానీ పూరి గారిని కలవడం అప్పుడు కుదరలేదని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత పూరిని కలిశానని.. ఆయన చెప్పిన కథ విని ఓకే చేశానని.. అదే ‘లైగర్’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాల్లోకి రావడానికి తాను పడిన కష్టాలను విజయ్ ఏకరువు పెట్టాడు.
మన రౌడీ హీరో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడని అతడి మాటలను బట్టి తెలుస్తోంది. చిరంజీవి, నానిలాగానే ఇండస్ట్రీలో ఇప్పుడు తనదైన ముద్ర వేస్తున్నాడు.