Chennai Rains: తమిళనాడులో ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వర్షాలు కురుస్తుంటాయి. దేశమంతా నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురిస్తే.. తమిళానడులో మాత్రం ఈశాన్య రుతుపవనాల కార ణంగా వర్షాలు కురుస్తాయి. అంటే అక్టోబర్‌లో వర్షాకాలం మొదలువుతుంది. ఈ సీజన్‌లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో తమిళనాడులో వరదలు వస్తాయి. తుపాన్ల కారణంగా చెన్నైతోపాటు అనేక నగరాలు నీటమునిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అక్టోబర్ వచ్చిందంటే చెన్నై వాసుల్లో వణుకు మొదలవుతోంది.
మొదలైన వర్షాలు..
తమిళనాడులో వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడక్కడ మోస్తరు వానలు కురుస్తున్నాయి. వీటికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, తుపానుగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
ఇళ్లలో, మేడలపై బైక్‌ల పార్కింగ్..
వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో గతంలో కార్లు, ద్విచక్రవానాలు కొట్టుకుపోయాయి. 2015, 2018, 2020లో వచ్చిన వరదలకు ఇంటి బయట పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఈ నేపథ్యంతో తాజా వర్షాతో ప్రజలు వణుకుతున్నారు. తమ ద్విచక్ర వాహనాలను ఇంటిలోపల గదిలో లేదా.. ఇంటి పైకప్పులపై పాక్కింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్పందిస్తున్న నెటిజన్లు..
చెన్నైలో ద్విచక్ర వాహనాలను ఇళ్లలో, పైకప్పులపై పార్కింగ్ చేసిన వీడియోలు నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలా ఎలా సాధ్యం అని కొందరు. స్పెషల్‌గా నిర్మించుకుంటున్నారా అని కొందరు.. ఈ కష్టం ఎవరికీ రావొద్దు అని ఇంకొందరు.. కామెంట్లు పెడుతున్నారు.