https://oktelugu.com/

Dharmana Brothers: ధర్మాన సోదరుల మధ్య బిగ్ వార్

ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య పద్మప్రియ, కుమారుడు కృష్ణ చైతన్య పెత్తనం ఎక్కువైంది. వారి వ్యవహార శైలి తో ధర్మాన ప్రసాదరావు కుటుంబం ఇబ్బంది పడినట్లు ప్రచారం జరిగింది.

Written By: , Updated On : September 7, 2023 / 12:43 PM IST
Dharmana Brothers

Dharmana Brothers

Follow us on

Dharmana Brothers: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం లో మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఎదురీదుతున్నారా? ఆయనకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? సహాయ నిరాకరణ చేస్తున్నారా? వారి వెనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారా? అంటే శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ధర్మాన కృష్ణ దాస్ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో విభేదాలు సెట్ చేసే పనిలో ఆయన ఉన్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం అసమ్మతిని సెట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి సోదరుడు ధర్మాన ప్రసాదరావు కారణం కావడాన్ని కృష్ణదాస్ జీర్ణించుకోలేకపోతున్నారు.

అన్న కోసం నరసన్నపేట నియోజకవర్గాన్ని విడిచిపెట్టి.. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి ధర్మాన ప్రసాదరావు మారారు. కానీ నరసన్నపేట పాత క్యాడర్ తో మాత్రం ప్రసాదరావు ఇంకా టచ్ లోనే ఉన్నారు. ఆ మధ్యన పప్పు నిప్పులా ఉండే ధర్మాన సోదరుల మధ్య ఇటీవల సయోధ్య కుదిరింది. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిందని తెలుస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే సోదరులు ఇద్దరి మధ్య వైరం ప్రారంభమైంది. జగన్ ధర్మాన ప్రసాదరావును కాదని కృష్ణ దాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో సోదరులు ఇద్దరి మధ్య ఎడబాటు ప్రారంభమైంది. దానికి కుటుంబ సభ్యులు మరింత కారణమయ్యారు.

ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య పద్మప్రియ, కుమారుడు కృష్ణ చైతన్య పెత్తనం ఎక్కువైంది. వారి వ్యవహార శైలి తో ధర్మాన ప్రసాదరావు కుటుంబం ఇబ్బంది పడినట్లు ప్రచారం జరిగింది. నరసన్నపేట నియోజకవర్గంలో ప్రసాదరావు అనుచరులుగా చలామణి అయిన నాయకులందరినీ అణచివేసినట్లు టాక్ నడిచింది. ఈ తరుణంలో మంత్రివర్గ విస్తరణలో కృష్ణదాస్ పదవి కోల్పోయారు. ప్రసాదరావు దక్కించుకున్నారు. అప్పటినుంచి నరసన్నపేట నియోజకవర్గంలోని పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల నాయకులు ధర్మాన ప్రసాదరావు గూటికి చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణ దాస్ నిర్వహించే కార్యక్రమాలకు వారు హాజరు కావడం లేదు. కావాలనే ధర్మాన ప్రసాదరావు వారిని హాజరుకానివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మెజారిటీ క్యాడర్ కృష్ణ దాస్ తో విభేదిస్తోంది. దీనికి ధర్మాన ప్రసాద రావే కారణమని వార్తలు వస్తున్నాయి. అయితే చాలామంది నాయకులు ధర్మాన సోదరుల రాజకీయ మధ్య సతమతమవుతున్నారు. వారంతా మధ్య మార్గంగా టిడిపిలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ధర్మాన సోదరులు వర్గాలుగా విడిపోయి.. అధికారం కోసం ఒకటయ్యారు. వారి తీరును చూసిన క్యాడర్ టిడిపి గూటికి చేరింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోదరులు ఇద్దరి మధ్య నలిగిపోతున్న నాయకులు కొందరు ఈపాటికే టిడిపి నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. మొత్తానికైతే ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అగాధం శ్రీకాకుళం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.