Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి హిందువు కాదా? ఆయన క్రిస్టియనా? అన్యమతస్తుడికి అత్యున్నత పదవి అప్పగించరా? గతంలో రాని అభ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆయన కుమార్తె వివాహము క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్షాలు, నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి రెండోసారి బాధ్యతలు నిర్వర్తించనన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి ఆయన టీటీడీ పాలక మండలి చైర్మన్గా నియమితులయ్యారు. తిరుమలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు జగన్ ఆయనకు రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇంకా ఆయన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ఆయన అన్య మతస్థుడని.. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేశారని.. పెద్ద దుమారం నడుస్తోంది. సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఓ క్రిస్టియన్ కు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా అని.. మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. అసలు హిందూ నేతలు కనిపించడం లేదా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరు సరికాదని.. అన్యమతస్తుడిని తప్పించి.. హిందువును పదవి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇంతకుముందు చైర్మన్గా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి పై సైతం ఇదే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆ వివాదం తేలిగ్గా సద్దుమణిగింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి విషయంలో మాత్రం ఫోటోలు నేరుగా వైరల్ అవుతుండడంతో భక్తులు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.
అయితే రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఎటువంటి ఆరోపణలు రాలేదు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సంస్కరణలు తీసుకొచ్చారని.. భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారని.. కరుణాకర్ రెడ్డి కి మంచి పేరు ఉంది. అయితే అప్పుడు లేని మత అభ్యంతరాలు.. ఇప్పుడెందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తొలుత కరుణాకర్ రెడ్డిలో కమ్యూనిస్టు భావజాలం ఉండేదని.. తర్వాత ఆయన పరమ భక్తుడిగా మారారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయనపై క్రిస్టియన్ ముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలని.. కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు అసలు సిసలు హిందువులని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. కానీ కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. దీనిపై ఆయన స్పందించి స్వయంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.