Bandi Sanjay: కేసీఆర్.. హరీష్ రావు.. ‘బండి సంజయ్’ లాగిన ‘న్యాయం’

-హుస్నాబాద్ కు మరో న్యాయమా? -పుష్కర కాలమైనా గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు? -మీ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తి చేసుకుంటావా? -హుస్నాబాద్ ప్రజల కష్టాలు కంటికి కన్పించడం లేదా? -బాధితులకు పరిహారం ఇవ్వకుండా భూములు, ఇండ్లు లాక్కుంటావా? -తక్షణమే ప్రాజెక్టులను పూర్తి చేయకుంటే బీజేపీ ఉద్యమిస్తుంది -ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్… గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : October 1, 2021 5:59 pm
Follow us on

-హుస్నాబాద్ కు మరో న్యాయమా?
-పుష్కర కాలమైనా గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు?
-మీ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తి చేసుకుంటావా?
-హుస్నాబాద్ ప్రజల కష్టాలు కంటికి కన్పించడం లేదా?
-బాధితులకు పరిహారం ఇవ్వకుండా భూములు, ఇండ్లు లాక్కుంటావా?
-తక్షణమే ప్రాజెక్టులను పూర్తి చేయకుంటే బీజేపీ ఉద్యమిస్తుంది
-ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన వివక్ష చూపుతూ హుస్నాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు ప్రారంభమై 12 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి చేయలేకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆ ప్రాజెక్టుల తరువాత సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో మొదలుపెట్టిన రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నేటికీ పరిహారం ఇవ్వలేదని, నష్టపరిహారం ఇవ్వకుండానే వారి ఇండ్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు భూ నిర్వాసితులకు 2021 సంవత్సరం ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతోపాటు సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందని, కేసీఆర్ మెడలు వంచైనా హుస్నాబాద్ ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం 35వ రోజు పొట్లపల్ల నుండి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ దారి పొడవునా ప్రజలను కలిసి వారి సమస్యలు వింటూ ముందుకు కదిలారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని బండి సంజయ్ కు మొర పెట్టుకున్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు సైతం ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయకుండా పొట్ట కొట్టిందని వాపోయారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘2009లో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 1.14 టీఎంసీ నీటి సామర్థ్యంతో గౌరవెల్లి, 0.4 టీఎంసీ సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల కోసం రైతుల నుండి 1836 ఎకరాల సేకరించారు. ఆనాడు ఒక్కో ఎకరాకు 2 లక్షల 15 వేల పరిహారం మాత్రమే అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో 2017లో 8.23 టీఎంసీల సామర్థ్యం పెంచుతూ పనులు ప్రారంభిస్తున్నట్లు గొప్పగా ప్రకటించింది. ప్రజల నుండి అదనంగా 2 వేల ఎకరాలు సేకరించారు. దీనివల్ల 7 గిరిజన తండాలు ముంపుకు గురైనా అక్కడి బాధితులకు ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. ఎలాంటి సాయమూ అందజేయకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు.

‘‘ ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 3,836 ఎకరాలు సేకరించాల్సి ఉండగా…పుష్కర కాలమైనా ఇంకా 272 ఎకరాల భూసేకరణ పూర్తి కానేలేదు. బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించకుండానే వాళ్ల ఇండ్లను కూల్చివేసే కుట్ర జరుగుతోంది. తొలుత వంద కుటుంబాలకు పరిహారం ఇచ్చినా ముంపుకు గురైన ఇళ్ల పెరటి స్థలాలకు సంబంధించి సాయం అందలేదు.111 మందికి అసలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు. సర్వే జాబితాలో వాళ్ల పేర్లు లేవు. వారిని బాధితులుగా గుర్తించకపోవడం దారుణం’’అని బండి సంజయ్ మండిపడ్డారు.

• ‘‘2015లో 246 మంది భూ నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ప్యాకేజీ ప్రకటించినా ఇప్పటి వరకు ఇవ్వనేలేదు. వారందరికీ 2021 నాటి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. 18 ఏళ్లపైబడిన పిల్లలు నేడు 300 పైచిలుకు ఉన్నారు. వెంటనే రీ సర్వే చేసి వారికి సైతం సాయం అందించాల్సిందే. ఆనాడు తోటపల్లి రిజర్వాయర్ కు 1400 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేశాక మా భూములు మాకివ్వాలని రైతులు డిమాండ్ చేస్తే ఈ ప్రభుత్వం ఎకరాకు రూ.9.50 లక్షలు చెల్లిస్తే మీ భూములు మీకు స్వాధీనం చేస్తామని ప్రకటించింది. అట్లాంటప్పుడు గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు కూడా 2021 మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంటికో సమస్య ఉంది. వీటిని పరిష్కరించకముందే ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీన్ని అడ్డుకోవాలి. మా సమస్యలను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.’’అని అన్నారు.

• ‘‘అసలు…కేసీఆర్ కు సిగ్గుందా? నీ నియోజకవర్గానికి, నీ అల్లుడి నియోజకవర్గానికి ఒక న్యాయం…..హుస్నాబాద్ కు ఇంకో న్యాయమా? ఎందుక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు? ఇది నీ వైఫల్యం కాదా? హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎన్నికల సమయంలో సెంటిమెంట్ గా వాడుకుంటావ్…గెలిచాక గాలికొదిలేస్తవా? నీ సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల పట్ల ఇంత వివక్ష ఎందుకు? హుస్నాబాద్ ప్రజలు ప్రేమిస్తే అక్కున చేర్చుకుంటారు… వంచిస్తే అంతు చూస్తారు. సిద్దిపేట, గజ్వేల్ లో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఇక్కడి స్థానిక కంటికి కన్పించడం లేదా? ప్రజలు ఓట్లేసింది అభివ్రుద్ది కోసమా? లేక కేసీఆర్ భజన చేయడానికా? ప్రాజెక్టు పూర్తిగాకపోతే హుస్నాబాద్ నుండే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతోంది’’అని హెచ్చరించారు.

• ‘‘గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు 2009లో ప్రారంభిస్తే పుష్కర కాలమైనా ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేసీఆర్ హుస్నాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ ప్రాజెక్టుల తర్వాత మొదలైన రంగనాయకసాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులు మాత్రం శరవేగంగా పూర్తయ్యాయి. మరి గండిపల్లి ,గౌరవెళ్లి ప్రాజెక్టులు… ఎందుకు పూర్తవడం లేదు? కుర్చీ వేసుకొని గౌరవెళ్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాటలేమైనయ్? హుస్నాబాద్ నియోజకవర్గంలో… బీడు భూములకు నీళ్లు అందిస్తాను… ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? సాగు, తాగు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతూ నీళ్లో చంద్రశేఖరా..! అంటూ ప్రజలు పడుతున్న బాధలు కన్పించడం లేదా? తక్షణమే భూ నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించి… సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేశారో..? హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అలాగే పూర్తిచేయాల్సిందే’’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.