Babu Mohan Son: తెలంగాణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ సమీపించే కొలదీ ఇవి బయట పడుతున్నాయి. ఫిరాయింపులు సైతం పెరుగుతున్నాయి. తాజాగా బిజెపి నాయకుడు బాబు మోహన్ కు కుమారుడు జలక్ ఇచ్చారు. తనను కాదని టిక్కెట్ దక్కించుకున్న తండ్రికి షాక్ ఇచ్చేందుకు కుమారుడు సిద్ధపడుతుండడం విశేషం. తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలోని ఆందోల్ నుంచి బిజెపి అభ్యర్థిగా బాబు మోహన్ ను హై కమాండ్ ప్రకటించింది. అయితే అది అంత ఆషామాషీగా జరగలేదు. తొలుత బిజెపి అధిష్టానం బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు కుమార్ వైపు మొగ్గు చూపింది. ఒకానొక దశలో ఆయనకి టిక్కెట్ అన్న ప్రచారం జరిగింది. దీనిపై బాబు మోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తనకు కాకుండా కుమారుడికి టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తమ కుటుంబంలో గొడవలు పెట్టేందుకే బిజెపి హై కమాండ్ ఇలా చేస్తుందంటూ ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికిటికెట్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే తనకు ముందుగా చెప్పాలని.. ఒకవేళ ఆయనకు టిక్కెట్ ఇస్తే పార్టీలో ఉండరని కూడా తేల్చేశారు. దీంతో బాబు మోహన్ ఆగ్రహానికి బిజెపి హై కమాండ్ వెనక్కి తగ్గింది. బాబు మోహన్ కి టికెట్ ప్రకటించింది.
అయితే ఈ పరిణామంతో బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మనస్థాపానికి గురైనట్లు సమాచారం. తనకు బిజెపిలో అవమానం జరిగిందంటూ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటు తండ్రి బాబు మోహన్ తో పాటు బిజెపికి గట్టి దెబ్బ కొట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బి ఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఉదయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఉదయం బి ఆర్ఎస్ లో చేర్చుకొని.. తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికలు పచ్చని కుటుంబాల్లో సైతం చిచ్చు రేపే విధంగా ఉన్నాయి. పోలింగ్ నాటికి ఇంకా ఇలాంటి పరిణామాలు ఎన్ని చూడవలసి వస్తుందోనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.