దేశంలో కరోనా తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అన్ని రాష్ర్టాలు లాక్ డౌన్ నిబంధనలు తొలగించాయి. అయితే అప్పుడే కొత్తగా మరో వైరస్ ప్రాణం పోసుకుంటోంది. డెల్టా ప్లస్ వేరియంట్ జనాన్ని అతలాకుతలం చేసేందుకు రెడీ అవుతోంది. కరోనా కంటే శక్తివంతమైన వైరస్ మ్యూటెంట్ గా దీన్ని భావిస్తున్నారు. దేశంలో థర్డ్ వేవ్ ఏర్పడడానికి ఇదే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మహారాష్ర్ట, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త మ్యూటెండ్ వైరస్ తో 40 కేసులు బయటపడ్డాయి. దీన్ని ప్రభుత్వం కూడా ధృవీకరించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కేటగిరీలుగా విభజించింది. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలను అప్రమత్తం చేసింది. మ్యూటెంట్ తీవ్రతను వివరించింది.
డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వీపీ జోయ్ (కేరళ), సీతారాం కుంటే (మహారాష్ర్ట), ఇక్బాల్ సింగ్ బైంస్ (మధ్యప్రదేశ్)లకు వేర్వేరుగా లేఖలు రాసింది. దేశంలో ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగులోకి వచ్చాయంటూ ఇప్పటికే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
డెల్టా వైరస్ మరింత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఊపిరితిత్తులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. వేరియంట్ వల్ల శరీరంలోని మోనోక్లోనల్ యాంటీ బాడీ రెస్పాన్స్ సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించారు. దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేసులు వెలుగు చూసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.