Raja Shyamala Yagam: మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? యాగాలతో నేతలు అధికారంలోకి రాగలరా? ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఇదే. యాగాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది స్వరూపానందేంద్ర స్వామి. ఆయన చేతుల మీదుగా రాజశ్యామల యాగం చేసిన కెసిఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. గత ఎన్నికల ముందు జగన్ తో ప్రత్యేక యాగం చేయించడంతో… ఆయన సైతం అధికారంలోకి రాగలిగారని ఒక ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట జగన్ తో మరోసారి రాజశ్యామల యాగం చేయించి.. అధికారంలోకి తెప్పించాలని స్వరూపానందేంద్ర స్వామి ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
ఏటా విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ఐదు రోజులు పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చివరి రోజు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారని సమాచారం. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర స్వామి సీఎం జగన్ కు కలిసి ఆహ్వాన పత్రం అందించారు.
అయితే ఈసారి జగన్ యాగానికి హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి. కెసిఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారని స్వరూపానందేంద్ర స్వామి సెలవిచ్చారు. అటు స్వరూపానందేంద్ర స్వామికి సైతం కెసిఆర్ హైదరాబాదులో ప్రత్యేక స్థానం ఇచ్చారు. కానీ స్వామి గారు చెప్పినట్టుగా కెసిఆర్ అధికారంలోకి రాలేకపోయారు. స్వామీజీ ఒకలా దీవిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో అధికారంలోకి వస్తారు అనుకున్న కెసిఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. దీంతో స్వామీజీ జోష్యానికి కాస్త ఇబ్బందులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్… స్వామీజీని నమ్ముతారా? నమ్మితే వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారా? మరోసారి రాజశ్యామల యాగాన్ని జరిపి.. అధికారాన్ని అందుకోగలరా? అన్నది చూడాలి.