
టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత టిక్ టాక్ పై ఆధారపడ్డ లక్షల మంది క్రియేటర్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. భారత్ లో టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేసే రేసులోకి ఇన్‌స్టాగ్రామ్ కూడా దిగింది. షార్ట్ వీడియోల షేరింగ్ కోసం ‘రీల్స్’ అనే ఓ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. టిక్ టాక్ తరహాలో 15 సెకన్లలోపు నిడివి ఉండే వీడియోలను ఈ రీల్స్ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టొచ్చు.
షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ల కేటగిరిలో టిక్ టాక్ స్థాయికి తగ్గ యాప్ లు ఏవీ లేకపోవడంతో ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఇదే సమయంలో చింగారీ, రొపోసో లాంటి దేశీయ షార్ట్ వీడియో షేరింగ్ సేవలు అందించే యాప్ లు తెరపైకి వచ్చాయి. వాటికి వినియోగదారులు వేగంగా పెరుగుతూ వచ్చారు. కానీ, సేవల నాణ్యత గురించి ఫిర్యాదులు వచ్చాయి.
ఒక్కసారిగా పెరిగిన వినియోగదారుల భారాన్ని తట్టుకుని, సంతృప్తికరంగా సేవలు అందించేందుకు ఆ యాప్ లు శ్రమిస్తున్నాయి. ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి ఓ పెద్ద యాప్ షార్ట్ వీడియో విభాగంలోకి అడుగుపెట్టడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి.