https://oktelugu.com/

AP Police: ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పలేని ఏపీ పోలీసులు

పలానా కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని చెప్పేందుకు సైతం పోలీసులు వద్ద సరైన కారణాలు లేవు. కడపలో బీటెక్ రవి అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే ఇది ఇట్టే అర్థమవుతుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 15, 2023 / 12:30 PM IST

    AP Police

    Follow us on

    AP Police: గతంలో రాష్ట్ర స్థాయి నేతలను, ఒక స్థాయి కలిగిన రాజకీయ ప్రత్యర్థులపై కేసుల నమోదు, అరెస్టులు జరిగేవి. ఇప్పుడు మాత్రం వారూ,వీరూ అన్న తేడా లేకుండా.. ఏపీలో రాజకీయ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. తాజా మాజీ మంత్రులు, టిడిపి కీలక నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు నియోజకవర్గస్థాయి నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. అవేవో పాత కేసులను తిరగదోడి మరి అరెస్టులు చేయిస్తున్నారు. రాజకీయ పగా, ప్రతీకారాలకు పోలీసు వ్యవస్థను నిస్సిగ్గుగా వినియోగించుకుంటున్నారు. తాజాగా బీటెక్ రవి అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

    పలానా కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని చెప్పేందుకు సైతం పోలీసులు వద్ద సరైన కారణాలు లేవు. కడపలో బీటెక్ రవి అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే ఇది ఇట్టే అర్థమవుతుంది. రాత్రిపూట ఫోన్లు టాప్ చేసి.. నిఘా పెట్టి ప్రయాణంలో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. అసలు అరెస్టు చేసిన వారు పోలీసు లో, లేకుంటే ఆగంతకులో తెలియని పరిస్థితి ఉంది. మేం పోలీసులం.. ఫలానా కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. అని చెప్పేందుకు కూడా సాహసించలేని స్థితిలో పోలీసులు ఉన్నారంటే.. ఏపీలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితులు తెలియజేస్తున్నాయి. కేవలం ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన చిన్న తోపులాట కేసును ఈ స్థాయిలో చూపించారంటే.. విపక్షనేతగా ఉండేటప్పుడు జగన్ విశాఖ విమానాశ్రయంలో నడిపిన ఎపిసోడ్ మాట ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    బీటెక్ రవి అరెస్టు విషయంలో డిఎస్పి ప్రెస్ మీట్ చూస్తే ఎన్నెన్నో అనుమానాలు తలెత్తుతాయి. అప్పట్లో ఓ ఏఎస్ఐ కు గాయాలయ్యాయని.. బాధితుడు ఫిర్యాదుతో అరెస్టు చేసామని పోలీసులు చెబుతున్నారు. అంటే ఏఎస్ఐ గాయమైన విషయం పది నెలల తర్వాత గుర్తించారా? చిత్తూరు జిల్లా అంగళ్ళ కేసులో సైతం చంద్రబాబును నిందితుడిగా చూపి నాలుగు రోజులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు పది నెలల తరువాత బీటెక్ రవి పై కేసు నమోదు చేయడం చూస్తుంటే.. పోలీసులు ఏ స్థాయిలో దిగజారిపోయారో అర్థం అవుతోంది. అయితే ఈ ఒక్క కేసుతో ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు.. బీటెక్ రవి పై మరిన్ని కేసులు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తుండడం విశేషం. కేసుల్లో అరెస్టు చేయడం తప్పులేదు కానీ.. అరెస్టు చేస్తున్న తీరు మాత్రం సహేతుకంగా లేదు. ఇది ముమ్మాటికీ తప్పిదంగానే కనిపిస్తోంది.