Homeజాతీయ వార్తలుYS Sharmila: రెంటికీ చెడ్డ రేవడి అయిన షర్మిల!

YS Sharmila: రెంటికీ చెడ్డ రేవడి అయిన షర్మిల!

YS Sharmila: ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ.. ప్రస్తుత ముఖ్యమంత్రి చెల్లి.. రాజకీయం ఆమెకు వెన్నతో ఎట్టిన ముద్ద. ఇదీ మొన్నటి వరకు షర్మిలపై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో షర్మిలను చూస్తే అర్థమవుతుందని తెలంగాణ రాజకీయ నేతలు జాలి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ అడగకపోయినా మద్దతు ప్రకటించి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఇందుకు ఆమెకు కనీసం ఆ పార్టీ కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. తనను కొన్ని చోట్ల అయినా ప్రచారానికి పిలుస్తారని ఆమె ఆశపడ్డారు. అసలు షర్మిల ప్రస్తావన తీసుకు రావడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు అంగీకరించడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు వైఎస్‌ ప్రస్తావన వద్దనుకుంటున్నారు. వైఎస్‌పై తెలంగాణలో వ్యతిరేకత ఉందని ఆయన వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కానీ.. మేలు ఉండదని అనుకుంటున్నారు. మరోవైపు షర్మిల తీసుకున్న నిర్ణయం బూమరాంగ్‌ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు కాంగ్రెస్‌ ఆదరించకపోగా, అటు సొంత పార్టీ లీడర్లు పార్టీని వీడారు.

వైఎస్సార్‌ను కీర్తించని రేవంత్‌..
రేవంత్‌రెడ్డి వైఎస్సార్‌ను కీర్తించడానికి అంగీకరించడం లేదు. ఓ జాతీయ టీవీ చానల్‌ చర్చలో పాల్గొన్నప్పుడు.. వైఎస్‌ను గొప్పగా చెప్పడాన్ని అంగీకరించలేదు. ఆయనొక్కరే కాదని చంద్రబాబు, జైపాల్‌రెడ్డి, పీవీలు కూడా గొప్పేనని స్పష్టం చేశారు. వైఎస్‌ తెలంగాణను వ్యతిరేకించారని.. అవమానించారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. పైగా షర్మిల తన పాదయాత్రలో ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్లుగా అందర్నీ తిట్టారు. ఇది కూడా వివాదాస్పదమయింది. ఇప్పుడు షర్మిల నీడ కాంగ్రెస్‌పై పడితే.. అది తమకే నష్టమని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే మద్దతు ప్రకటించినా కనీసం కృతజ్ఞతలు చెప్పడం లేదు. ప్రచారం చేయాలని అడగడం లేదు.

‘పొంగులేటి’ కృతజ్ఞత..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నిర్ణయం మంచిదని అభినందించారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం మంచి నిర్ణయం అని ఓ టీవీ చానెల్‌లో పేర్కొన్నారు. మిగతా నేతలెవరూ షర్మిల మద్దతుపై కనీసం స్పందించడం లేదు. దీంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించకుండా ఎన్నికల బరి నుంచి వైదొలిగినా షర్మిలకు కాస్త గౌరవం ఉండేదని ఇప్పుడు ఏదీ లేకుండాపోయిందని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version