గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూలిపాళ్ల నరేంద్ర అన్నీతానై వ్యవహరించిన సంగం డెయిరీని.. ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ)కి బదలాయిస్తూ సర్కారు ఆదేశాలు జారీచేసింది. నరేంద్ర అరెస్టు నేపథ్యంలో రోజూవారీ కార్యకలాపాలు నిలిచిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
మూడు నెలలపాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి.. పాత యాజమాన్యానికి అప్పగించడమా? ఇదే విధానాన్ని అమల్లో ఉంచడమా? అనే విషయమై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తాజాగా ఆదేశాలిచ్చారు.
కాగా.. ఇప్పటి వరకూ సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే.. నిబంధనలను అతిక్రమించి, ఆ చట్టం పరిధిలోకి మార్చారనేది ఆరోపణ. ఈ అంశంపై గతంలో నోటీసులు సైతం జారీచేసింది సర్కారు. అయితే.. సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూలిపాళ్ల నరేంద్ర.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇదేకాకుండా.. పలు అక్రమాలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే.. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే స్టే తెచ్చుకున్నారని, లేకపోతే.. విచారణను ఎందుకు ఎదుర్కోలేదన్నది వైసీపీ నేతల వాదన. ఇక.. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. చంద్రబాబు హయాంలో మంత్రి పదవి రాకపోవడానికి ఈ అక్రమాలే కారణమనే ఆరోపణలు చేసేవారు కూడా ఉన్నారు.
అటు టీడీపీ నేతలు మాత్రం.. ఇదంతా ఉద్దేశపూర్వక దాడేనని ఆరోపిస్తున్నారు. టీడీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వరుసగా తమ పార్టీ నేతలపై కేసులుపెడుతున్నారని అంటున్నారు. ఎవరి ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. సంగం డెయిరీని ప్రభుత్వపరం చేసే ప్రయత్నం జరిగిపోయింది. మూడు నెలల కాలానికే అని చెబుతున్నప్పటికీ.. ఆ తర్వాత పాత యాజమాన్యానికే అప్పగిస్తారా? అన్నది సందేహమే. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.