YCP: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రాష్ర్టంలో వ్యతిరేకిస్తూ తనలోని నైజాన్ని బయటపెడుతున్నారు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వైసీపీ తదనంతర పరిణామాల్లో కూడా బీజేపీని గట్టెక్కించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోప్రస్తుతం జగన్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలో ఒకలా రాష్ర్టంలో మరోలా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనుమానాలకు తావిస్తున్నారు.

కీలకమైన వ్యవసాయ బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ కేంద్రానికి మద్దతు తెలిపి బిల్లులు చట్టాలు కావడానికి సహకరించిన వైసీపీనే ప్రస్తుతం రాష్ర్టంలో వాటికి వ్యతిరేకంగా పోరాడటం వింత కలిగిస్తోంది. రైతు సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో జరిగే బంద్ కు వైసీపీ మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు మొదటి నుంచి సహకారం అందిస్తున్న వైసీపీ అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించుకోవడం సంచలనం కలిగిస్తోంది.
కీలక బిల్లుల్లో కేంద్రానికి మద్దతిస్తూ రాష్ర్ట ప్రయోజనాలను కాపాడుకోవాలని భావించిన రాష్ర్టం ఏ విధమైన లాభాలను మాత్రం పొందలేకపోయింది. పోలవరం విషయంలో జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలు వైసీపీకి గుదిబండలుగా మారాయి. దీంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో తెగదెంపులు చేసుకోవాలనే చూస్తున్నట్లు సమాచారం.
దేశంలో రైతులకు నష్టం కలిగించే రైతు చట్టాలను వైసీపీ మద్దతు తెలపడంతో అవి కాస్త చట్టాలుగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఏడాదిగా రైతు సంఘాల ఆధ్వర్యంలో చట్టాలు రద్దు చేయాలని పోరాటాలు సాగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం పట్టు విడవడం లేదు. దీంతో ఉద్యమం కాస్త ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో వైసీపీ ఉద్యమానికి మద్దతు తెలపడం అందరిలో సందేహాలకు కారణమవుతోంది.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా వైసీపీ కేంద్ర నిర్వాకానికి ఎదురు చెప్పలేకపోయింది. దీంతో ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో కేంద్రంతో విభేదించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కార్మికులతో కలిసి పోరు సల్పేందుకే నిశ్చయించుకున్నట్లు సమాచారం. తాజాగా భారత్ బంద్ కు సహకరిస్తూ వైసీపీ రైతుల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.