Krishna and MS Reddy: తెలుగు సినిమా స్వర్ణయుగంలో నిర్మాతను తండ్రిగా భావించేవారు. ఈ క్రమంలోనే ఆ రోజుల్లో అప్పటి నిర్మాత ఎమ్మెస్ రెడ్డిగారిని కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఎంతో గౌరవించేవారు. ముఖ్యంగా ఎమ్మెస్ రెడ్డి గారు ఒక కథను అంగీకరించారు అంటే.. ఇక ఏ హీరో కూడా ఆ కథ పై అనుమానం వ్యక్తం చేసేవారు కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు కూడా ఎమ్మెస్ రెడ్డి కథల ఎంపిక పై నమ్మకం ఉంచేవారు. అందుకు తగ్గట్టుగానే నాగిరెడ్డి – చక్రపాణిల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాతగా కూడా ఎమ్మెస్ రెడ్డిగారికి గౌరవం దక్కింది.

అలాంటి ఎమ్మెస్ రెడ్డి తన బ్యానర్ లో హిట్ అనే మాటే లేకుండా దాదాపు పదిహేను ఏళ్లుగా వరుస అపజయాలతో చితికిపోయారు. ఓ దశలో చిన్నాచితకా హీరోలు కూడా ఎమ్మెస్ రెడ్డి గారికి డేట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదట. స్వతహాగా అహంభావి అయిన ఎమ్మెస్ రెడ్డి.. ఆ అపజయాలను జీర్ణించుకోలేకపోయారు. ఒకప్పుడు విజయాలు తప్ప అపజయాలు తెలియని ఆయన.. మారుతున్న సినిమా పరిస్థితులను, ప్రధానంగా హీరోల డిమాండ్స్ ను ఊహించలేదు.
అందుకే, ఆయన కొన్నాళ్ళు సినిమా నిర్మాణాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కృష్ణగారికి తెలిసింది. కృష్ణగారు ఎమ్మెస్ రెడ్డిగారికి కబురు పెట్టారు. ‘మీలాంటి పెద్దవారు ఇండస్ట్రీ వదిలిపెట్టకూడదు. మీకు నేను ఓ సినిమా చేస్తాను’ అంటూ కృష్ణ డేట్స్ ఇచ్చారు. అయితే, దర్శకుడిగా మాత్రం కోదండరామిరెడ్డి నే పెట్టండి’ అంటూ కృష్ణ కండిషన్ పెట్టారు.
ఎమ్మెస్ రెడ్డి గారు తప్పక, కోదండరామిరెడ్డి దగ్గరకు వెళ్లి ‘‘ఏమయ్యా డైరెక్టరూ.. ఏమిటి పరిస్థితి ? నువ్వు నాకు ఓ సినిమా చేయాలయ్యా’ అని ఆజ్ఞాపించారు. అడగడం ఎమ్మెస్ రెడ్డి గారికి నచ్చదు. అయితే, రెడ్డిగారి ఆదేశానికి అంగీకారం తెలిపిన కోదండరామిరెడ్డి ‘కానీ మీరు ఈ సినిమా కథలో జోక్యం చేసుకోకూడదు’ అని షరతు పెట్టాడు. ఆ మాటలు జీర్ణించుకోలేకపోయినా ఎమ్మెస్ రెడ్డి గారు చివరకు ఒప్పుకోక తప్పలేదు.
అలా కృష్ణ హీరోగా ఎమ్మెస్ రెడ్డి గారు నిర్మాతగా ‘పల్నాటి సింహం’ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయింది. ఎమ్మెస్‌రెడ్డిగారు ఘనంగా శతదినోత్సవం కూడా జరిపారు, ఆ శతదినోత్సవ వేడుకలో ‘ఇరవై ఏళ్లుగా ఎదురు చూసీ చూసీ అలసిపోయిన నాకు, కృష్ణ ఒక విజయాన్ని ఇచ్చారు’ అంటూ ఆయన కృష్ణ వైపే చూస్తూ ఎమోషనల్ గా చెప్పారు.