నర్సాపురం ఎంపీ రఘురామరాజుతో వైసీపీ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయించాలని ప్రయత్నిస్తున్న ఎంపీ.. జగన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖకు సూచించారు కోవింద్. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ఏ1, ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో తాను రాష్ట్రపతికి రాసిన లేఖలో వివరించానని చెప్పారు రఘురామరాజు.
అయితే.. విజయసాయి సైతం రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈయనకు చెందిన ఇండ్ – భారత్ కంపెనీల్లో పలు అక్రమాలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. చెప్పడానికి ఇంకా చాలా ఉందంటూ ట్వీట్ కూడా చేశారు విజయ సాయి. ఈయన రాసిన లేఖపైనా రాష్ట్రపతి స్పందించారు. తమకు లేఖ అందించినట్టు అక్నాలెడ్జ్ మెంట్ అందించారు. దీంతో.. రాష్ట్రపతి విచారణకు ఆదేశించారని, రఘురామకు తిప్పలు తప్పవని విజయసాయి ట్వీట్ చేశారు. ఈ విధంగా.. జగన్-రఘురామ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇదిలాఉంటే.. వీరిద్దరూ మరింత డీప్ గా వెళ్తూ.. ఒకరి విషయాలు మరొకరు బయట పెట్టుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా అన్నది తెలియాలంటే చరిత్రలోకి కాస్త వెనక్కు వెళ్లాలి. వైఎస్ హయాంలో రఘురామరాజు జగన్ కుటుంబానికి సన్నిహితుడే. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడే ఈ రఘురామ రాజు. అలా.. బంధాలు బాగునప్పుడు రాసుకుపూసుకునే తిరిగేవారు. కాబట్టి.. జగన్ ఆర్థిక లావాదేవీల గురించి ఈయనకు పూర్తిగా తెలుసునని చెబుతారు.
అదే సమయంలో రఘురామ ఆర్థికంగా బలపడడానికి వైఎస్ ఇతోదికంగా సహాయం చేశారని కూడా చెబుతుంటారు. కాబట్టి.. వాటికి సంబంధించిన వ్యవహారం మొత్తం విజయ సాయిరెడ్డికి తెలుసు. చెప్పడానికి చాలా ఉందంటూ.. విజయసాయి ట్వీట్ చేయడంలోనూ ఆంతర్యం ఇదేననే అభిప్రాయం ఉంది. ఈ విధంగా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసిన వీళ్లు.. రాష్ట్రపతికి, కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటూ.. తమ వివరాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయసాయి రఘురామ సీక్రెట్లు బయటపెడుతుంటే.. రఘురామ జగన్ రహస్యాలపై ఉత్తరాలు రాస్తున్నారు. నన్ను గెలికితే నేను మౌనంగా ఉంటానా? అనే మాటను ఎవరికి వారు అప్లై చేసుకుంటున్నారని అంటున్నారు. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుంది? ఎవరిపై ఎవరు విజయం సాధిస్తారు? అన్నది చూడాలి.