
Ramoji Rao Eenadu: ఈనాడు… ఒకప్పటి తరం వారు ఆ పేపర్ చెప్పేవన్నీ నిజాలే అనుకునేవారు. ఉదయం సూర్యుడు రాకముందే గడపల్ని తాకే ఆ పేపర్ మోసుకొచ్చేవన్నీ సత్య ప్రమాణాలే అనుకునేవారు. అలా తెలుగువారు తమ జీవితంలో ఈనాడును ఒక అనివార్యమైన అలవాటుగా మార్చుకున్నారు. రామోజీరావును ఈ కాలపు పులిట్జర్ గా మనసుల్లో నిలుపుకున్నారు.. ఆయన ప్రియా పచ్చళ్ళను ఎగబడి కొన్నారు. అన్నదాత మ్యాగజిన్ కు రైతులు చందా కట్టారు. సితార ను కళ్లకు అద్దుకొని చదివారు. విపుల, చతుర ను భద్రంగా దాచుకున్నారు. ఆ సత్తెకాలపు రోజుల్లో ఈనాడు ఏం చెబితే అదే వేదం. ఏం రాస్తే అదే ధర్మం.. తనకు నచ్చని పేపర్ యజమాని చేస్తున్న సారా వ్యాపారంపై ఈనాడు ఉద్యమం మొదలుపెట్టింది. తనకు గిట్టని ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ” సారూ పారూ” అంటూ కార్టూన్లు వేసింది. తనకు నచ్చినవాడు ముఖ్యమంత్రి అయితే మద్యపానం మంచిదని రాసింది. అంటే సమాజ రీతిని తన అడుగులకు మడుగులు వత్తే వ్యవస్థగా మార్చుకుంది.
జగన్ మీద సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల ఫోటోలు వేసేందుకు కూడా ఈనాడు వెనకాడ లేదు. పైగా తన మార్గదర్శి మీద కేసు పెట్టారని అక్కసుతో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద రాయని వార్త అంటూ లేదు. అంతే కాదు అప్పట్లో ఈనాడుకు పోటీగా దాసరి నారాయణరావు ఉదయం పత్రిక ఉండేది. ఆ పత్రిక మూతపడేందుకు ఈనాడు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి దాసరి నారాయణరావు వార్తల మీద నిషేధం కూడా ప్రకటించింది.. ఏదో ఆయన చరమాంకంలో కొన్నివార్తలు రాసింది. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ తెలుగు సమాజానికి నేర్పిన సుద్దులు, బుద్ధులు ఎన్నో.
అలాంటి ఈనాడు ఇప్పుడు శోకాలు పెడుతోంది. కన్నీరు కారుస్తోంది. గుండెలు అవిసెలా బాధ పడుతోంది. తన యజమానిని విచారిస్తున్నారని విచారం వ్యక్తం చేస్తోంది. జగన్ నరకం చూపిస్తున్నాడంటూ తెగ బాధ పడిపోతుంది. మా యజమాని శుద్ధపూస అంటూ సర్టిఫికెట్ ఇస్తోంది. ఇవన్నీ నిజమే అనుకుందాం.

ఇన్ని చెబుతున్న ఈనాడు. ఈ స్మార్ట్ యుగంలోనూ పట్టాభి అనే టిడిపి నాయకుడిని కొట్టకున్నా కొట్టారు అని చాటింపు వేసింది. జగన్ ప్రభుత్వం పనితీరు సరిగా లేదని తాటికాయంత అక్షరాలతో రాస్తున్నది. అదే సమయంలో “మా బాబు గారు గొప్ప వారని” స్తుతి కీర్తనలు ఆలపిస్తోంది. తాజాగా నిన్న ఏపీ సిఐడి అధికారులు విచారిస్తున్న క్రమంలో రామోజీరావు మంచం మీద ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చె
క్కర్లు కొట్టింది. దీనికి కారణం ఏపీ సిఐడి అధికారులు అని ఈనాడు ఆరోపణ.. విచారిస్తున్న క్రమంలో అలాంటి ఫోటోలు ప్రచురించవద్దని ఈనాడు ఆక్షేపణ. తన దాకా వచ్చింది కాబట్టి ఈనాడు నీతులు చెబుతోంది. ఒకప్పుడు ఈనాడు చేసింది ఏమిటి? రామోజీరావు పన్నిన కుయుక్తుల మాటమేటి? కర్మ అనేది ఒకటి ఉంటుంది.. మనం పువ్వు విసిరిస్తే పువ్వు తగులుతుంది.. రాయి విసిరిస్తే ఆ రాయి వేగంగా మన అద్దాలమేడనే పగలగొడుతుంది.