
Modi Educational Qualification: దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైన అంశం ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హత. ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కింద దరఖాస్తు చేశాడు. అయితే సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు మోదీ విద్యార్హత గురించి తెలియజేయాల్సిన అవసరం లేదని, దానితో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజోపయోగం లేదని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది కోర్టు. దీంతో ఆప్‌కు ఆయుధం దొరికనట్లయింది.
రహస్యం ఏమిటో?
మోదీ విద్యార్హతపై కోర్టు తీర్పును గౌరవిస్తూనే కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని చర్చనీయాంశం చేశారు. ప్రధాని విద్యార్హత గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా అన్న చర్చకు తెర తీశారు. దేశ అధినేత ఏం చదువుకున్నాడో చెబితే జరిగే నష్టం ఏమిటో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడిపిస్తున్నారు. నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రజలు కూడా తమ విద్యార్హతను వెల్లడిస్తున్నారు. దీంతో మోదీ విద్యార్హతను గోప్యంగా ఉంచడం వెనుక మర్మం ఏమిటని ఆప్ నేతలు, బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మౌనం వీడని బీజేపీ..
బీజేపీకి అనుకూలమైన సోషల్ మీడియా వేదికగానే ప్రధాని విద్యార్హతపై చర్చ జరుగుతున్నా, నేతలు తమ విద్యార్హతను ప్రకటిస్తున్నా.. బీజేపీ మాత్రం మౌనమే వహిస్తోంది. మోదీ విద్యార్హతపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
గతంలో భిన్నమైన ప్రకటనలు..
మోదీ విద్యార్హతపై గతంలో రకరకాల ప్రకటనలు వచ్చాయి. ఒక దశలో మోదీనే తాను పాఠశాల స్థాయి వరకే చదువుకున్నానని ప్రకటించారు. తర్వాత ఆయనే స్వయంగా డిగ్రీ చేశానని తెలిపారు. ఆ తర్వాత ప్రస్తుత హోం మంత్రి అమిత్‌షా కూడా మోదీ విద్యార్థలు ప్రకటించి సర్టిఫికెట్లు ప్రదర్శించారు. ఇప్పుడేమో మోదీ విద్యార్హతతో దేశ రక్షణకు ప్రమాదం అని బీజేపీ ప్రకటిస్తోంది. విద్యార్హత ఏమైనా ప్రమాదకరమా. ఓ ముఖ్యమంత్రి ప్రధాని విద్యార్హత తెలుసుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడమే ఇప్పడు చర్చకు కారణమైంది.
చదువు లేకపోయినా పాలించొచ్చు..
భారత రాజ్యాంగం చదువు లేకపోయినా దేశాన్ని పాలించే హక్కును కల్పించింది. విద్యార్హతతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ఏ విద్యార్హత ఉన్నా.. ప్రధాని పదవికి వచ్చే ముప్పు ఏమీ లేదు. అయితే గియితే అరవింద్ కేజ్రీవాల్‌కు చదువు లేనివారు పాలించొద్దన్న అభిప్రాయం ఉండొచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం ఆయన అభిప్రాయం చెల్లదు. చాలా మంది కేజ్రీవాల్ అభిప్రాయంతో అంగీకరించరు. అలాంటప్పుడు మోదీ విద్యార్హతలో గోప్యత ఎందుకు పాటిస్తున్నారన్న ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం లేకపోవడమే ఇప్పుడు చర్చకు కారణమైంది.
భావోద్వేగ రాజకీయాలు ఎందుకు?
ఒకవైపు మోదీ విద్యార్హతపై చర్చ జరుగుతుండగా, మోదీ భావోద్వేగ రాజకీయాలకు తెర తీశారు. కొంతమంది తన వ్యక్తిత్వానికి భంగం కలిగించాలని చూస్తున్నారని, తనకు సమాధి కట్టాలని ప్రయత్నిస్తున్నారని ప్రకటించారు. సుపారీ హత్యకు కూడా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉన్న మోదీ దానిపై విచారణ జరుపకుండా ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించేలా ప్రకటన చేయడం విమర్శలకు తావిస్తోంది.

విద్యార్హతను దాచడం.. దానిని కప్పిపుచ్చేలా భావోద్వేగ రాజకీయాలు చేయాలని యత్నిచడం ఎంతమాత్రం బీజేపీకి శోభను ఇవ్వదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఎందుకు సంకోచం అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.