Jammu And Kashmir: జమ్ము-కశ్మీర్ లోని కథువాలో భారత ఆర్మీ సైనిక వాహనాలపై పాక్ ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో సోమవారం (జూలై 08) దాడికి పాల్పడ్డారు. స్థానిక మద్దతుదారుల సాయంతో ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి కుట్ర పన్నినట్లు సంకేతాలిచ్చారు. అత్యాధునిక ఆయుధాల్లో ఎం4 కార్బైన్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, ఇతర మందుగుండు సామగ్రి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దాడి జరిగిన బద్నోటా గ్రామానికి సరైన రోడ్డు కనెక్టివిటీ లేదని, వాహనాలు గంటకు 10 నుంచి 15 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లలేవని, ఆర్మీ వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ఉగ్రవాదులు ఈ భూభాగం నుంచే దాడి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఒకరిద్దరు లోకల్ గైడ్లు కొండలపై ఉండగా.. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ వెహికిల్స్ పై గ్రెనేడ్లు విసిరి, ఆ తర్వాత కాల్పులు జరిపారు. ‘గతంలో మాదిరిగానే ఈ దాడిలో కూడా వాహనాల డ్రైవరే మొదటి టార్గెట్’ అని ఆర్మీ అధికారులు చెప్పారు. దాడికి ముందు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానికంగా ఉండే గైడ్ ఒకరు ఈ ఆపరేషన్ కు సాయం చేశాడని, వారికి ఆహారం, ఆశ్రయం కల్పించాడని, దాడి అనంతరం వారు తమ స్థావరాలకు చేరుకోవడానికి ఆయన సహకరించాడు’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
సమీపంలోని అటవీ ప్రాంతాలకు పారిపోయినట్లు భావిస్తున్న దుండగుల ఆచూకీ కోసం కథువాలో మంగళవారం (జూలై 09) భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగింది. అయితే కొండ ప్రాంతాలు, పొగమంచు, దట్టమైన వృక్షసంపద గాలింపు చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారాయి.
కథువా పట్టణానికి 150 కిలో మీటర్ల దూరంలోని లోహై మల్హర్ లోని బద్నోటా గ్రామం సమీపంలోని మచేడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) సహా ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. జమ్ము ప్రాంతంలో నెలలో ఐదోసారి జరిగిన ఈ ఉగ్రదాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సైనికుల మృతిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు సైనికులు కృతనిశ్చయంతో ఉన్నారని ఉద్ఘాటించారు.
‘కథువా (జమ్ముకశ్మీర్)లోని బద్నోటాలో జరిగిన ఉగ్రదాడిలో మనం ధైర్యవంతులైన ఐదుగురు సైనికుల ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సైనికులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
మన సైన్యంపై పిరికి పంద దాడులను తీవ్రంగా ఖండించదగినవని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘నెల వ్యవధిలో జరిగిన ఐదో ఉగ్రదాడి దేశ భద్రతకు, సైనికుల ప్రాణాలకు తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. అలుపెరగని ఈ ఉగ్రదాడులకు పరిష్కారం బలమైన చర్యల ద్వారానే వస్తుంది తప్ప బూటకపు ప్రసంగాలు, తప్పుడు వాగ్ధానాల ద్వారా కాదు. ఈ విషాద సమయంలో దేశానికి అండగా ఉంటామని’ చెప్పారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎంలు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్ మృతులకు సంతాపం తెలిపారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Another terrorist attack in jammu and kashmir kathua five jawans were killed in this atrocity
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com