Tadepalli Palace
Tadepalli Palace: అమరావతి : జగన్ తాడేపల్లి ప్యాలెస్ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందినదా? ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ముచ్చటి పడి కట్టుకున్నారా? బలవంతంగా దానిని జగన్ లాక్కున్నారా? అందుకే ఆదిశేషగిరిరావు టిడిపిలో చేరారా? ఇలా చాలా రకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ దీనిపై ఎవరూ, ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వైసిపి ఓడిపోవడంతో తాడేపల్లి ప్యాలెస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అది కృష్ణ కుటుంబానికి చెందినదని.. త్వరలో స్వాధీనం చేసుకుంటారని కూడా టాక్ నడిచింది. ఈ తరుణంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.
ఘట్టమనేని కృష్ణ కుటుంబంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సమయంలోనే గల్లా అరుణకుమారిని పార్టీలోకి ఆహ్వానించి చంద్రగిరి టిక్కెట్ ను కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలవడంతో రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. గల్లా అరుణకుమారి స్వయాన ఘట్టమనేని కృష్ణకు వియ్యపురాలు. కృష్ణ కుమార్తెకి గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్ కు ఇచ్చి వివాహం చేశారు. కేవలం కృష్ణ సిఫారసులు మేరకు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకున్నారని ప్రచారం జరిగింది. కృష్ణ చనిపోయేటంతవరకు జగన్ అంటే అభిమానం చూపేవారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా అభిమానించేవారు. అల్లుడు జయదేవ్ టిడిపి ఎంపీగా ఉన్నా.. కృష్ణ మాత్రం జగన్ పట్ల సానుకూల భావనతో ఉండేవారు.
వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఒకరు. సోదరుడు కృష్ణ ఆదేశాలు మేరకు ఆయన వైసీపీలో కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వైసీపీలో ఉన్నారు ఆదిశేషగిరిరావు. పార్టీకి ఓటమి ఎదురైనా జగన్ ను ఆయన విడిచిపెట్టలేదు. అయితే ఏపీలో రాజకీయాలు చేయాలంటే రాజధానిలో ఇంటి నిర్మాణం అవసరమని ఆదిశేషగిరిరావు జగన్ కు హితబోధ చేశారు. అప్పుడే ఇంటి నిర్మాణ బాధ్యతలను ఆదిశేషగిరిరావుకు అప్పగించారు జగన్. ఇంటి స్థలం సేకరణ నుంచి భవన నిర్మాణం, కార్యాలయం నిర్మాణ పనులు అన్నింటిని ఒక ప్లాన్ ప్రకారం పూర్తి చేశారు ఆదిశేషగిరిరావు. అంతకుమించి ఆయనకు పెద్దగా సంబంధం లేదు. కానీ ఆ ఇల్లు ఆదిశేషగిరిరావుది అని ప్రచారం జరిగింది. బలవంతంగా ఆ ఇంటిని లాక్కోవడం వల్లే ఆదిశేషగిరిరావు పార్టీకి దూరమయ్యారని టాక్ నడిచింది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు ఆదిశేషగిరిరావు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేవలం ఆ ఇంటి నిర్మాణ బాధ్యతలను మాత్రమే తాను చూశానని.. ఆ ఇల్లు తనది కాదని తేల్చేశారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి తనను పోటీ చేయమని జగన్ కోరారని.. అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే తమ మధ్య గ్యాప్ వచ్చిందని.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు ఆదిశేషగిరిరావు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Do you know who owns jagan tadepalli palace krishnas brother adiseshagiri rao clarity