Land Scam In Visakhapatnam: వైసీపీ సర్కారులో కాపులు, ఇతర బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నా సూపర్ పవర్ మాత్రం జగన్ తన వద్దే ఉంచుకున్నారు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని తన అస్మదీయులైన నాలుగురు పెద్ద రెడ్లకు కట్టబెట్టారన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా విడగొట్టి వారి చేతిలో పెట్టారని ఎప్పటి నుంచో విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. అటు సొంత పార్టీలో సైతం ఇదే అభిప్రాయం ఉంది. అటు సీనియర్ మంత్రులైనా వారిదీ నిస్సహాయ స్థితే. కానీ ఏం చేయగలం. బుగ్గ కారు.. మందీ మార్భలంతో వారు హల్ చల్ చేస్తున్నా వారి చేతిలో ఎటువంటి పవర్ ఉండదు. వారి శాఖల్లో కూడా ఆ నలుగురు రెడ్ల ప్రమేయం ఎక్కువ. కానీ ఏం చెప్పలేని.. ఏం చేయలేని పరిస్థితి వారిది. అయితే ఆ నలుగురూ ఇప్పుడు రాష్ట్రాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని తెరతీస్తున్న దోపిడీకి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి, వేంరెడ్డి ప్రభాకరరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఈ నలుగురే ఇప్పుడు సర్కారులో, వైసీపీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మిగతా వారంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు మాదిరిగా పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ నలుగురి ఫోకస్ ఇప్పుడు సాగర నగరంపైనే పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మాటున వందలాది ఎకరాలు పోగేసుకుంటున్నారు. అధికార పార్టీ లోకల్ లీడర్స్ మాత్రం అచేతనంగా ఉండిపోవాల్సి వస్తోంది. కళ్లెదుటే వారు భూములు పోగెసుకుంటున్న తీరు వారికి నచ్చడం లేదు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ ఒక అడుగు ముందుకేసి ఓపెన్ అయ్యారు. తరువాత సైలెంట్ అయ్యారు. వైసీపీ సర్కారు స్వయం ప్రకటిత క్యాపిటల్ విశాఖను టార్గెట్ చేసుకొని ఆ నలుగురు తెరలేపుతున్న భూ మాఫియా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. తాజాగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భూదందా ఒకటి వెలుగులోకి వచ్చింది. క్విడ్ ప్రో తరహాలో ఒక భూమి డీల్ ఒకటి బయటకు వచ్చింది.ఒక కంపెనీతో నిర్మాణ ఒప్పందం చేసుకొని.. ప్రాఫిట్ లో సదరు కంపెనీకి 30 శాతం కేటాయించారు. దానికి బదులుగా రిషికొండలో భూ కేటాయింపులు చేశారు. ఇదేందయ్యా అని అడిగితే మా వ్యాపారాలు ఇట్టే ఉంటాయని సమాధానం చెబుతున్నారు.
అంతకు ముందు విజయసాయిరెడ్డి భూ దందా వెలుగులోకి వచ్చింది. ఖాళీ చేతులతో విశాఖలో అడుగుపెట్టారు. తరువాత బంధు గణాన్ని దించారు. అల్లుడు, కుమార్తెతో ఒక కంపెనీ పెట్టి భూ దందాకు తెరలేపారు. వందలాది ఎకరాలు తమ కంపెనీల పేరిట రాయించుకున్నారు. తమ భూముల కోసం ఏకంగా భోగాపురం ఎయిర్ పోర్టు రహదారి అలైన్ మెంట్ మార్చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన చర్యలు అధినేతకు సైతం కంటగింపుగా మారాయో ఏమో కానీ.. ఆయన్ను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. కానీ విలువైన ఆస్తులు కావడంతో వాటి ఆలనాపాలన చూసేందుకు ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాల పేరిట విశాఖకు వస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్నారు. ఆయన గురించి తెలియంది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఎన్నో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. ఆయనకు ఇప్పుడు అవకాశం దక్కడంతో ఇంతో కొంత పోగు చేసుకోక తప్పరన్న టాక్ నడుస్తోంది. కొద్దిరోజులు అయితే కానీ ఆయన విషయం బయటకు రాదు. ఇక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి పాత్రపై ఎటువంటివి బయటకు రావడం లేదు. ప్రభుత్వంలో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో సహజంగా నిఘా సంస్థలన్నీ ఆయన చెప్పుచేతల్లో ఉంటాయి. అవి దూరమైన నాడు ఆటోమేటిక్ గా బయటపడే అవకాశముంది. మొత్తానికైతే సాగర నగరం నలుగురు పెద్ద రెడ్లకు జగన్ రాసిచ్చినట్టున్నారన్న టాక్ మాత్రం రోజురోజుకూ విస్తరిస్తోంది.