
గతంలో ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన దళిత డాక్టర్ సుధాకర్ ఉదంతం ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక ఇందులో ఉన్న కుట్రా కోణాన్ని సిబిఐ తేల్చిచెప్పింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సుధాకర్ అనస్టీషియన్ గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో మాస్కులు, పీపీఈ కిట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరడం…. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో తన ఆవేదనను వీడియో ద్వారా తెలియచేయడంతో ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తన ఉద్యోగం కోసం ఎన్నో విఫలయత్నాలు చేసిన సుధాకర్ చివరికి నడిరోడ్డుపై తప్పతాగి, అర్థ నగ్నంగా ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ పోలీసులకు చిక్కాడు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం తోనే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఈ క్రమంలోనే తను పిచ్చివాడిలా చిత్రీకరించారని సుధాకర్ మొరపెట్టుకున్నాడు. జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయిన ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించింది. ముందు సుధాకర్ కి ఎవరు గుండు కొట్టారు? అతడిని నడిరోడ్డు మీద అర్థనగ్నంగా మార్చింది ఎవరు? అతనిపై అసలు ఈ కుట్ర ఎందుకు జరిగింది…. అన్న చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
అయితే సీబీఐ వారు మాత్రం సుధాకర్ తప్పు ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కేసును క్లోజ్ చేసే వారు కానీ వారి విచారణలో తేలింది ఏమిటంటే…. వైద్య చికిత్స నిమిత్తం సుధాకర్ ని నేరుగా పిచ్చి ఆసుపత్రికి తరలించడం…. కావాలనే అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కొన్ని మందులను ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో కేసు తీవ్రతను గుర్తించిన సీబిఐ వారికి సుధాకర్ కు అనుకూలంగా కొన్ని ఆధారాలు దొరకడంతో వాటిపై మరింత లోతైన విచారణ కోసం న్యాయస్థానాన్ని అదనపు సమయం అడిగినట్లు తెలుస్తోంది.
ఇక సీబీఐ వర్గాల లోపలి మాట ఏమిటంటే…. సుధాకర్ కి నిజంగానే అన్యాయం జరిగినట్లు ఉందని…. అతనిపై కుట్రపూరితంగా పిచ్చోడు అని ముద్రవేసి కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ కిట్ల ఉదంతం నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఇక సిబిఐ విచారణలో ఇవన్నీ బయటకొస్తాయి అనుకోండి… అది వేరే విషయం. అయినా రోజు రోజుకీ ఇలా దళితులపై జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే ఈ రాష్ట్రంలో ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.