
‘ఎవడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అన్నట్లుగా యువ నిర్మాతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీల్లో యువరక్తం ఉరకెలేస్తోంది. కొత్త హీరోలకు తోడు.. కొత్త నిర్మాతలు వస్తుండటంతో తెరపై క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకపోయి అగ్ర నిర్మాతలుగా పేరు సంపాదించుకున్న వారికి సైతం సాధ్యంకానీ రీతిలో సినిమాలను నిర్మిస్తూ యువ నిర్మాతలు దూసుకెళుతున్నారు.
నిన్నటివరకు ఓ వెలుగు వెలిగిన అగ్ర నిర్మాతలంతా కొత్తవాళ్ల ధాటికి నిలువలేకపోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా విన్పిస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి బడా నిర్మాతలుగా పేరుతెచ్చుకున్న అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, బండ్ల గణేష్ వంటి తదితరులు ఇబ్బందులు పడుతున్నారట. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఎలాంటి బడా సినిమా చేయాలన్న వీళ్లే తీసేవాళ్లు. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీలోకి కొత్త నిర్మాతలు వస్తుండటంతో వీరి హవా కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. కొత్త నిర్మాతలు ఖర్చుకు వెనుకాకుండా ముందస్తుగా హీరోలతో కమిట్మెంట్ చేసుకుంటున్నారు.
సీనియర్ నిర్మాతలేమో కథ.. దర్శకుడు.. డబ్బులంటూ లెక్కలేసుకుంటున్నారు. వీరంతా ఆచితూచి వ్యవహరిస్తూ సమయం వృథా చేస్తుండగా యువ నిర్మాతలు మాత్రం దర్శకులు, హీరోలకు అడ్వాన్సు ఇచ్చేస్తూ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ విషయంలో మైత్రీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, సాహు గారపాటి వంటి చాలా బ్యానర్లు చకచకా సినిమాలను నిర్మిస్తున్నాయి. దీంతో దర్శకులు, హీరోలంతా వారి నిర్మాణంలో పనిచేసేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో సీనియర్ నిర్మాతలకు హీరోలు, దర్శకులు డేట్స్ దొరకడం లేదట. దీంతోపాటు హీరోలు కూడా సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని నిర్మాణాలు చేపడుతుండటంతో సీనియర్ నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పోటీ సినీ నిర్మాణంలోనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ నెలకొంటుంది. కొందరి చేతుల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం కొత్తవాళ్ల చేతుల్లోకి వెళుతోంది. గతంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ అంతా దిల్ రాజు చేతిలో ఉండేది. ప్రస్తుతం వేరే వారిలో చేతుల్లోకి వెళ్లిందనే టాక్ విన్పిస్తుంది. అదేవిధంగా ఆంధ్రా, సీమలోనూ కొత్తవాళ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వీరంతా సీనియర్ల కంటే ముందుగానే అంటే సినిమా ప్రారంభంలోనే డిస్ట్రిబ్యూషన్ పై డీల్ చేసుకుంటున్నారట.