https://oktelugu.com/

Pune Porsche car case : సినిమాల్లో చూపించేవి మరీ అంత కల్పితాలేం కాదన్న మాట !

ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు కాకుండా హత్య అని, నింధితులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు ఇంజినీర్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2024 / 03:55 PM IST

    Pune car accident

    Follow us on

    Pune Porsche car case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు కేసు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ససూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజయ్ తవాడే, డాక్టర్ హరి హర్నోర్ ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడి నుంచి రక్తంను సేకరించిన ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తారు. కానీ ఫోరెన్సిక్ కు పంపిన రక్తం నిందితుడికి కాదని పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మీడియాకు వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

    ‘మే 19వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ససూన్ ఆసుపత్రిలో మైనర్ అయిన నిందితుడి నుంచి తీసుకున్న రక్తనమూనాలను చెత్త బుట్టలో పడేసి, మరో వ్యక్తి శ్రీహరి హల్నార్ రక్తనమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ససూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ అజయ్ తవాడే సూచనల మేరకు శ్రీహరి హల్నోర్ దీన్ని మార్చినట్లు దర్యాప్తులో కనుగొన్నాం.’ అని అమితేష్ కుమార్ చెప్పారు.

    ఇద్దరు డాక్టర్ల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తవాడే, యువకుడి తండ్రి ఫోనులో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలిందని కుమార్ మీడియాకు తెలిపారు.

    ప్రస్తుతం అబ్జర్వేషన్ హోమ్ లో ఉన్న మైనర్ ఆల్కహాల్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ రాత్రి అతను బార్ లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నట్లు సీసీటవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.

    ఈ కేసు మద్యం మత్తులో చేసిన పొరపాటుగా తాము భావించడం లేదని, పూర్తి స్పృహతోనే చేసినదిగా భావిస్తున్నామని కమిషనర్ అన్నారు. రెండు బార్లలో పార్టీలు చేసుకున్న మైనర్ ఇరుకైన, రద్దీగా ఉండే వీధుల్లో నెంబర్ ప్లేట్ లేని కారును వేగంగా నడపడం పూర్తి స్పృహలో ఉన్నాడు. తన చర్య వల్ల ప్రజలు చనిపోతారని అతనికి తెలుసు.’ కచ్చితమైన ఫలితాలను నిర్ధారించడానికి నిందితుడి రక్తం రెండు నమూనాలను ప్రమాదం తర్వాత వేర్వేరు సమయాల్లో పరీక్షించినట్లు నగర పోలీసు చీఫ్ తెలిపారు.

    మొదటి నమూనాలో అతని శరీరంలో ఆల్కహాల్ లేదని, అలాగే రెండో నమూనాలో కూడా అదే రిజల్ట్ రావడంతో అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేస్తే అసలు రక్తం ఆయనది కాదని తేలిందన్నారు. అంటే నిందితుడి బ్లడ్ కు బదులు మరో వ్యక్తి బ్లడ్ ఫోరెన్సిక్ కు పంపారని తేలిందని చెప్పారు.

    నిందితుడు ప్రముఖ రియల్టర్ కుటుంబానికి చెందిన సంపన్నుడని, అతడిని కాపాడేందుకు అతని తండ్రి, తాత న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సీపీ ఆరోపించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద యువకుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు తానే నడిపానని చెప్పాలని డ్రైవర్ పై ఒత్తిడి తేవడంతో అతని తాతను కూడా అరెస్ట్ చేశారు. మైనర్ నిందితుడు రెండు బార్లలో మద్యం తాగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. దీనికి తోడు బార్ల సిబ్బంది, యజమానులకు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైద్యులు బ్లడ్ షాంపిళ్లు మార్చారనేందుకు మరింత బలం చేకూరుతోంది.

    అశ్విని కోస్తా, అనీష్ అవధియా అనే ఇద్దరు టెక్కీలు బైక్ పై వెళ్తుండగా పోర్షే కారు వారి బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బాలుడికి షరతులతో బెయిల్ మంజూరైంది. రోడ్డు ప్రమాదాలపై 300 పదాల వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయాలని, తాగుడు అలవాటుకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.

    దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ఆ ఉత్తర్వులను సవరించి అబ్జర్వేషన్ హోమ్ కు పంపింది. 17 ఏళ్ల 8 నెలల వయసున్న టీనేజ్ నిందితుడిని వయోజనుడిగా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు జువైనల్ బోర్డును కోరారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు కాకుండా హత్య అని, నింధితులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు ఇంజినీర్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.