YS Sharmila: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలక బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీలో నాలుగు రోజులుగా అసంతృప్త జ్వాలలు చల్లారడం లేదు. పార్టీ నేతలు, కార్యకర్తలను సంప్రదించకుండా పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయంపై సొంతపార్టీ నేతలు అధినేత్రిపై మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారని షర్మిలను నిలదీస్తున్నారు.
మూకుమ్మడి రాజీనామా..
తాజాగా మంగళవారం వైఎస్సార్ టీపీ కార్యాలయానికి వచ్చిన పలువురు నాయకులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజశేఖరరెడ్డి మీద గౌరవంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళను నమ్ముకున్న తమను నట్టేట ముంచిందని, కాంగ్రెస్ పార్టీ కి అమ్ముడు పోయిందని ఆరోపించారు. షర్మిల తీరుకు నిరసనగా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ నాయకులు పేర్కొన్నారు.
అడగకుండానే మద్దతు..
షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడాన్ని నాయకులు తప్పు పట్టారు. ఎవైరా మద్దతు కావాలని అడిగితే ఇస్తారు. కానీ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ అడగలేదని, కమ్యూనిస్టులు అడగలేదని, బీజేపీ అడగలేదని తెలిపారు. కానీ, షర్మిల మాత్రం ఏకపక్షంగా తానే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి వైఎస్సార్ ఆశయాలను తుంచేశారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకుని, పార్టీకోసం ఇన్నాళ్లూ కష్టపడిన తమను తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు.
గోబ్యాక్ అంటూ నినాదాలు..
తెలంగాణ ప్రజలను, పార్టీని నమ్ముకున్న నాయకులను మోసం చేసిన షర్మిలకు తెలంగాణలో ఉండే హక్కుల ఏదని నాయకులు అన్నారు. వెంటనే తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలోనే గోబ్యాక్ షర్మిల అంటూ నినదించారు. తెలంగాణలో ఉంటే తర్వాత ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని హెచ్చరించారు. షర్మిలను తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు.