YCP: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమంటున్న వైసీపీ ఎంపీలు .. కారణమిదీ

ప్రధానంగా వైసీపీ సర్కార్ పై వ్యతిరేకత, టిడిపి, జనసేన కూటమి కట్టడం, వైసీపీలోని అంతర్గత విభేదాలతో ఎక్కువమంది పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను.. వైసిపి 22 చోట్ల విజయం సాధించింది.

Written By: Dharma, Updated On : November 7, 2023 5:15 pm

YCP

Follow us on

YCP: వైసీపీ ఎంపీలు మరోసారి బరిలో దిగేందుకు విముఖత చూపుతున్నారా? వారి మార్పు అనివార్యమా? మచిలీపట్నం, కడప, రాజంపేట సిట్టింగ్ ఎంపీలు తప్పించి కొత్తవారు రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. పార్లమెంటు స్థానాలకు పోటీ చేయబోయే వైసిపి అభ్యర్థులు మారనున్నారని ప్రచారం జరుగుతోంది. ఓటమి భయంతో కొందరు, ఎమ్మెల్యేలుగా వెళ్లాలని మరికొందరు తమకు తామే తప్పుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది హై కమాండ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ప్రధానంగా వైసీపీ సర్కార్ పై వ్యతిరేకత, టిడిపి, జనసేన కూటమి కట్టడం, వైసీపీలోని అంతర్గత విభేదాలతో ఎక్కువమంది పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను.. వైసిపి 22 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. అంతులేని విజయం సాధించిన వైసీపీ.. మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను వెతుక్కోవలసిన అనివార్య పరిస్థితి ఎదురైంది. దీంతో కొందరు మంత్రులను, కీలక నేతలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు హై కమాండ్ కసరత్తు చేస్తోంది.

ఉత్తరాంధ్రలో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. ఆయనను పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నుంచి.. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా మార్చారు. కానీ ఇంతవరకు శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్లు వినిపిస్తున్న.. యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు చరిష్మ ముందు నిలవలేమని వారు భయపడుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఈసారి బెల్లాన చంద్రశేఖర్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే అక్కడ మంత్రి బొత్స ఉండడంతో బెల్లానకు పక్కనే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి వెళ్లాలని హై కమాండ్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. విజయనగరం ఎంపీగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అరకు పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి పోటీకి సిట్టింగ్ ఎంపీ బొడ్డేటి మాధవి విముఖత చూపుతున్నారు. ఆమె ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. విశాఖ సిటింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులు కావడంతో… ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్నదానిపై ప్రశ్నార్ధకంగా మిగిలింది. తొలుత విజయసాయిరెడ్డి పోటీ చేస్తారనుకున్నా.. తరువాత ఆయనను విశాఖ నుంచి తప్పించారు. ఇక్కడ సరైన అభ్యర్థిని బరిలో దించేందుకు వైసిపి అన్వేషిస్తోంది. కాకినాడ ఎంపీ ని సైతం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎంపీ అనుకున్నంత యాక్టివ్ గా పని చేయకపోవడంతో.. కొత్త అభ్యర్థిని అధిష్టానం వెతుకుతోంది.

వైసిపి సిట్టింగ్ ఎంపీలు ఎక్కువమంది ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా అరకు, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, బాపట్ల, చిత్తూరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. రాజమండ్రి, అనంతపురం, కర్నూలు, తిరుపతి ఎంపీలు సైతం ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. నరసాపురం లో రఘురామకృష్ణంరాజు స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని హైకమాండ్కు చెప్పినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలో కొత్త అభ్యర్థుల కోసం వైసిపి అధినాయకత్వం వెతుకుతోంది. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అక్కడ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలోకి వెళ్తారని.. వై వి సుబ్బారెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం తప్పదని ప్రచారం జరుగుతోంది.