https://oktelugu.com/

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కి ఏమైంది? విలీనంతో దారి తప్పిన ప్రజా రవాణా వ్యవస్థ

గత రెండు రోజులుగా జరిగిన ఆర్టీసీ ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. విజయవాడ బస్టాండులో జరిగిన ఘటనను సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు చూస్తే.. ఎవరికైనా ఒళ్ళు జలదరించక మానదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2023 / 05:07 PM IST

    APSRTC

    Follow us on

    APSRTC: ఆర్టీసీలో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం. దశాబ్దాలుగా వినిపిస్తున్న నినాదం ఇది. కానీ గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే సుఖవంతమైన ప్రయాణం లేదు. సురక్షితం అంతకంటే కాదు. ఆ రెండూ లేకపోవడంతో అంత శుభప్రదంగా కూడా కనిపించడం లేదు. సంస్థ గా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం అయ్యాక పూర్తిగా స్వరూపమే మారిపోతుందని భ్రమించారు. అంతలా భ్రమలు కల్పించారు. తీరా ఇప్పుడు చేతులెత్తేశారు. కండిషన్ లో ఉన్న బస్సులు కరువు అవుతున్నాయి. సుశిక్షితులైన సిబ్బంది లేకుండా పోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రైవేటు రవాణా వైపు ఆసక్తి చూపేలా పరిస్థితులు మారుతున్నాయి.

    గత రెండు రోజులుగా జరిగిన ఆర్టీసీ ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. విజయవాడ బస్టాండులో జరిగిన ఘటనను సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు చూస్తే.. ఎవరికైనా ఒళ్ళు జలదరించక మానదు. ఆ ఘటన మరువకముందే అనంతపురంలో మరో బస్సు బీభత్సం సృష్టించింది. మరో ముగ్గురు ప్రాణాలను హరించింది. తాజాగా కడప జిల్లాలో ఇద్దరికి తీవ్ర గాయాలకు కారణమైంది. ఇవన్నీ ఆర్టీసీ వైఫల్యాలుగా తేలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ ఘటనకు డ్రైవర్ కు తగినంత శిక్షణ లేకపోవడమే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. మిగతా ఘటనలకు కండిషన్ లేని బస్సులే కారణంగా తెలుస్తోంది.

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్సుల కొనుగోలు అంతంత మాత్రమే. దీనికి తోడు రహదారులు గోతుల మయంగా మారడంతో బస్సులు తరచూ మరమత్తులకు గురవుతున్నాయి. బస్సులకు సరిపడా సిబ్బంది లేదు. డ్రైవర్లతో పాటు కండక్టర్లు, డిపోల్లోని గ్యారేజ్ సిబ్బంది తగినంత మంది లేరు. ప్రతి బస్సుకు ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా. ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఉన్న సిబ్బందిపై పెను భారం పడుతుంది. అదే ప్రమాదాలకు కారణమవుతోంది.

    వాస్తవానికి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. కానీ ఆర్టీసీలో మాత్రం లక్షలకు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సులను సైతం కొనసాగిస్తున్నారు. విజయవాడలో ప్రమాదానికి గురైన బస్సు పది లక్షల కిలోమీటర్లు తిరిగింది. సరైన నిర్వహణ లేదు. పైగా అది కొత్త టెక్నాలజీ బస్సు. దీంతో అవగాహన లేక బస్సు స్టార్ట్ చేసే క్రమంలో ఏకంగా కాంప్లెక్స్ లోకి దూసుకుపోయింది. ముగ్గురు ప్రాణాలను బలిగొంది. ఆర్టీసీ ఏనాడు ప్రభుత్వంలో విలీనం అయ్యిందో.. ఆనాటి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడం లేదు. ప్రత్యేక అలవెన్సులు నిలిచిపోయాయి. రాయితీలు సైతం దక్కడం లేదు. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఒక్క విషయంలో మాత్రం పురోగతి కనిపిస్తోంది. అదే ఆర్టీసీ ఆస్తుల అన్యాక్రాంతంలో.. అంతకుమించి ఏదీ కనిపించడం లేదు.