రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు మిత్రులవుతారో… ఎవరు శత్రులవుతారో అంచనా వేయడం కష్టం. ఏళ్లనాటి ప్రతిపక్షమైనా మిత్రపక్షంగా మారొచ్చు.. ఏళ్లనాటి మిత్రపక్షమైనా ప్రతిపక్షంతో దోస్తీ కట్టొచ్చు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అలాంటి షాక్ ఎదురైంది. ఏళ్లపాటు సుదీర్ఘ బంధం కొనసాగించిన అకాలీదళ్ ఇప్పుడు ఎన్టీయేకు దూరమైంది.
Also Read: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి
బీజేపీ, అకాలీదళ్ పార్టీల ప్రయాణం సుదీర్ఘమైంది. ఏనాడూ ఎలాంటి వైరాగ్యాలు లేకుండా 23 ఏళ్ల పాటు తమ బంధాన్ని కొనసాగించాయి. ఇప్పుడు సడన్‌గా ఎన్డీయేతో తమ బంధాన్ని తెంచుకుంటున్నామని శిరోమనీ అకాలీదళ్ ప్రకటించింది. శనివారం పార్టీ ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం మూడు గంటలపాటు జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పాలని, ఆ కూటమి నుంచి బయటికి రావాలని అకాలీదళ్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారట. ‘కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల ప్రభావం రైతులపై తీవ్రంగా పడింది. కేవలం రైతులే కాదు.. వ్యవసాయంపై ఆధారపడే దళితులు, రైతు కూలీలు.. ఇలా అందరిపై పడింది. బీజేపీ తీసుకొచ్చిన బిల్లులు రైతులకు ప్రాణాంతకం.. వినాశకరమైనవి’ అని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మండిపడ్డారు.
‘‘కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను తాము సభలో వ్యతిరేకించాం. ఈ బిల్లులు నేరుగా రైతులకు, రైతు కూలీలకు నష్టం చేస్తాయి. వ్యవసాయ రంగానికి నష్టం చేస్తాయి. మేం చెప్పిన మాటలను కేంద్రం విశ్వాసంలోకి తీసుకోలేదు. అప్పటికీ కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయినా వినడం లేదు’’ అని బాదల్ మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించిందని, జమ్మూలో పంజాబీని రెండో అధికార భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలను నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి బయటకి రావాలి నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read: ఐక్యరాజ్యసమితిలో గర్జించిన మోడీ!
అయితే.. ఎన్టీయే నుంచి వైదొలగేందుకు ముందు పంజాబ్ ప్రజలతోనూ చర్చించినట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, రైతులు, ట్రేడర్స్, పేద ప్రజలతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతి, మత సామరస్యం, పంజాబ్ రైతుల బాగోగులు, పంజాబీ, సిక్కు ప్రయోజనాలను కాపాడడమే తమ పార్టీ మూల సిద్ధాంతమని అభివర్ణించారు. దీనికి అనుగుణంగానే తమ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లులు వీటికి విరుద్ధంగా ఉండడంతో తమ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు.