Chandrababu Jail: ఏపీలో ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కేసు విచారిస్తుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చంద్రబాబుకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ తరుణంలో న్యాయమూర్తి హిమబిందు కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
చంద్రబాబుది హై ప్రొఫైల్ కేసు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఆషామాషీ విషయం కాదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఈ ప్రభుత్వం ఇంత ఈజీగా జైలులో పెట్టలేకపోయిందని గుర్తు చేశారు. అటు భద్రతాపరంగా ప్రభుత్వాన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి హిమబిందుకు ఫోర్ ప్లస్ వన్ సెక్యూరిటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద సైతం భద్రతను పెంచినట్లు సమాచారం.
కేసు అంతా లోపభూయిష్టంగా ఉందని న్యాయ కోవిదులు, నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ల నమోదు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయని.. ప్రజా ప్రతినిధిగా ఉన్న నాయకుడిని అరెస్టు చేసినప్పుడు గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆ నిబంధనను సైతం పట్టించుకోకుండా సిఐడి అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అటు టిడిపి అనుకూల మీడియాలో దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక కథనాలు రాయిస్తున్నారు. మరోవైపు హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. ఈ తరుణంలో కేసు మరింత హై ప్రొఫైల్ గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.