Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో చంద్రబాబు తరుపు సీనియర్ న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తిపై కేసు పెట్టాలన్నా, దర్యాప్తు చేయాలన్నా గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని గుర్తు చేశారు. లంచ్ మోషన్ పిటీషన్కు అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది.
చంద్రబాబు బెయిల్ పై ఇవాళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బుధవారం ఇందుకు సంబంధించి వాదనలు జరగనున్నాయి. ఇది ఇలా ఉంటే మరోవైపు చంద్రబాబును సిఐడి కస్టడీ కి అప్పగించాలని సిఐడి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేసిన హౌస్ అరెస్ట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరుడుగట్టిన నేరస్తుల మధ్య భద్రత కరువైందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అయితే దీనిపై సిఐడి న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంతోనే ఉన్నారని.. జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉందని గుర్తు చేశారు. ఇంకా అదనపు భద్రత ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అభిప్రాయంతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబు హౌస్ అరెస్ట్ వినతిని పరిగణలోకి తీసుకోలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి లభించడం చంద్రబాబుకు ఉపశమనం కలిగించే విషయం. చంద్రబాబు అరెస్టులో నిబంధనలు పాటించలేదని ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా న్యాయ కోవిదులు, నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. కేసు నమోదు తో పాటు సెక్షన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని చెబుతున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైకోర్టులో చంద్రబాబుకు ఉపశమనం లభిస్తుందని టిడిపి వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. మరికొద్ది సేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం కానున్నాయి. సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.