ABP C Voter Survey : వచ్చేడాది ఐదురాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రామైన ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు నాడి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ-సీ ఓటరు సర్వే. ఈ సర్వే ప్రకారం.. ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు జెండాఎగరేసే అవకాశం ఉందట.
ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు గానూ.. నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్ కాంగ్రెస్ పాలనలో ఉండగా.. మిగిలిన యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కాషాయ ఏలుబడిలో ఉన్నాయి. అయితే.. ఈ నాలుగు రాష్ట్రాలనూ బీజేపీ నిలుపుకుంటుందని చెప్పడం గమనార్హం. భారీ వ్యతిరేకత ఉన్నట్టుగా ప్రచారమైన యూపీలో సీట్లలో చాలా వరకు కోత పడినప్పటికీ.. అధికారం మాత్రం బీజేపీనే సాధిస్తుందని చెప్పందీ సర్వే.
యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో 259 నుంచి 267 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. అధికారం తమదేనని ధీమాగా ఉన్న సమాజ్ వాదీపార్టీ 109 నుంచి 117 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు మాత్రమే సాధిస్తుందని చెప్పిన సర్వే.. కాంగ్రెస్ దారుణంగా 3 నుంచి 7 స్థానాలే గెలుస్తుందని ప్రకటించడం గమనార్హం. గత ఎన్నికలతో పోలిస్తే దాదా 60 సీట్లను బీజేపీ కోల్పోతుందని చెప్పింది. రాష్ట్రంలో 45 శాతం మంది ప్రజలు యోగీ పాలనపట్ల సంతృప్తిగా ఉన్నారని, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారని సర్వే చెప్పుకొచ్చింది.
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలకు గానూ.. 46 చోట్ల కాషాయ జెండా ఎగురుతుందని తెలిపింది. కాంగ్రెస్ 21 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగత్ ధామి పాలన పట్ల 36శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మరో 36 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని ప్రకటించింది. మొత్తానికి గెలుపు మాత్రం బీజేపీదేనని చెప్పిందీ సర్వే.
గోవాలో కూడా బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి 22 నుంచి 26 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 8 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు ఇక్కడ కూడా భారీ దెబ్బ తగులుతుందని తెలిపింది. గోవాలోనూ హస్తం పార్టీ 3 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనా వేసింది.
మణిపూర్ రాష్ట్రంలోనూ మరోసారి కాషాయ జెండా ఎగురుతుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 32 నుంచి 36 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని తెలిపింది. బీజేపీకి 40.5 శాతం, హస్తం పార్టీకి 34.5 శాతం ఓటు షేర్ అవుతుందని చెప్పింది.
పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటుతుందని అంచనా వేసింది. ఇక్కడ ఆప్ 51 నుంచి 57 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 38 నుంచి 46 స్థానాలు మాత్రమే సాధిస్తుందని ప్రకటించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ లో ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ-అకాలిదళ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అంచనా వేసింది.